జమ్మూకాశ్మీర్‌‌‌‌ అసెంబ్లీ ఎన్నికలు:అంత తక్కువా..19 స్థానాల్లోనే బీజేపీ పోటీ

జమ్మూకాశ్మీర్‌‌‌‌ అసెంబ్లీ ఎన్నికలు:అంత తక్కువా..19 స్థానాల్లోనే బీజేపీ పోటీ
  • పార్టీ నిర్ణయంపై సీనియర్ల గుర్రు 

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌‌‌‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం 19 స్థానాల్లోనే పోటీ చేయాలని నిర్ణయించింది. జమ్మూలో ఎక్కడా పోటీ చేయడంలేదని, కాశ్మీర్ లోయలోని 47 అసెంబ్లీ స్థానాల్లో 19 స్థానాల్లో మాత్రమే పోటీ చేయనున్నట్టు ప్రకటించింది.

 జమ్మూ కాశ్మీర్‌‌‌‌ లో ఈ నెల 18 నుంచి మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మూడో దశ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి గురువారం చివరి తేదీ కాగా.. ఇకపై అభ్యర్థుల పేర్లను ప్రకటించబోమని, కాశ్మీర్​లోని 28 స్థానాల్లో పోటీ చేయడం లేదని గురువారం ఆ పార్టీ ప్రకటించింది. 

గతంలో జమ్మూ కాశ్మీర్‌‌లోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ పోటీ చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. కానీ, ప్రస్తుతం కేవలం 19  స్థానాలకే పరిమితమైంది. అయితే, టికెట్లు రాక కొంతమంది బీజేపీ నేతలు తమ త్యాగాలను పార్టీ విస్మరించిందని ఇప్పటికే ఆరోపిస్తున్నారు. 

ఈ తరుణంలో 19 స్థానాల్లోనే పోటీ చేయాలని పార్టీ తీసుకున్న నిర్ణయం సీనియర్ నాయకులను అసంతృప్తికి గురి చేసింది. కాగా, బీజేపీ తన వైఖరి మార్చుకోవడంపై అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. 

కానీ, ఈ నిర్ణయం వ్యూహాత్మక చర్యల్లో భాగమేనని పార్టీ అంతర్గత వర్గాలు చెప్తున్నాయి. కాశ్మీర్‌‌లోని 19 మంది అభ్యర్థులతో కూడిన పార్టీ తుది జాబితాలో దక్షిణ కాశ్మీర్‌‌లోని 16 అసెంబ్లీ స్థానాల్లో ఎనిమిది మంది, సెంట్రల్ కాశ్మీర్‌‌లోని 15 స్థానాల్లో ఆరుగురు, ఉత్తర కాశ్మీర్‌‌లోని 16 స్థానాల్లో ఐదుగురు ఉన్నారు.