పాదయాత్రలొద్దు.. నిరసనలు చాలు!..పాదయాత్రల ఆలోచనకు బీజేపీ బ్రేక్ 

  • కాంగ్రెస్ ఏడాది పాలనపై ఆందోళనలకు పిలుపు  
  • పాలనపై ప్రజల్లో వ్యతిరేకత లేదని నేతల్లో భిన్నాభిప్రాయం 
  • అందుకే నిరసనలతోనే సరిపెట్టాలని నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సర్కారు ప్రజావిజయోత్సవ సభలు నిర్వహిస్తోంది. దీనికి కౌంటర్​గా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. కాంగ్రెస్ సర్కారు హామీలను అమలు చేయలేదంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పాదయాత్రలు చేపట్టాలని తొలుత డిసైడ్ అయింది.

అయితే, ప్రజల్లో అప్పుడే సర్కారుపై అంత వ్యతిరేకత రాలేదంటూ పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయం రావడంతో పాదయాత్రలపై వెనక్కి తగ్గింది. డిసెంబర్ మొదటివారంలో నిరసన కార్యక్రమాలు మాత్రం చేపట్టాలని నేతలకు పిలుపునిచ్చింది. దీనికితోడు ప్రజల్లో మరోసారి సర్కారు పనితీరుపై అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించింది.  

పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు 

రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలని బీజేపీ డిసైడ్ అయింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, అమలు చేసిన, చేయనివాటి గురించి వివరించాలని నిర్ణయించింది. ఇందుకు పాదయాత్రలే ప్రధాన మార్గం అని తొలుత యోచించింది. దీనిపై ఆ పార్టీ ముఖ్య నేతలూ చర్చించారు. ఈ పాదయాత్రలు స్థానిక సంస్థల్లో బీజేపీ పాగా వేసేందుకు ఉపయోగపడుతుందని భావించారు. కానీ ఈ అంశంపై ముఖ్యనేతల్లోనే భిన్నాభిప్రాయాలు రావడంతో స్టేట్ వర్క్ షాప్ లో చర్చించినట్టు తెలిసింది.

ఏడాది పాలనపై ప్రజల్లో ఇప్పుడే అంత వ్యతిరేకత రాలేదని అభిప్రాయాలు వచ్చాయి. దీనికితోడు పాదయాత్రలు ఎవరు చేయాలనే దానిపైనా క్లారిటీ లేకపోవడంతో అయోమయం నెలకొన్నది. ఆ సెగ్మెంట్​లో గతంలో పోటీ చేసిన అభ్యర్థుల నేతృత్వంలో జరగాలా? లేక ఆశించిన వారితోనా, లేక అక్కడి సీనియర్ నేత ఆధ్వర్యంలో నిర్వహించాలా? అనే దానిపై నేతల్లో స్పష్టత కరువైంది. దీనికితోడు ఇప్పటికే పార్టీలో పలు గ్రూపులు కొనసాగుతున్నాయి.

కొత్తగా వచ్చిన వారితో పాటు ముందు నుంచి పార్టీలో ఉన్న వారి మధ్య ఇప్పటికీ విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో పాదయాత్రలు చేపడితే కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని పార్టీ అధిష్టానం దృష్టికి కొందరు నేతలు తీసుకుపోయారు. దీంతో పాదయాత్రలకు బ్రేక్ పెట్టి.. ఇతర రూపాల్లో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించినట్టు తెలిసింది.  

వచ్చే నెల ఫస్ట్ వీక్ లో నిరసనలు 

కాంగ్రెస్ ఏడాది పాలనా వైఫల్యాలపై డిసెంబర్ 1 నుంచి 5 వరకూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఇటీవల జరిగిన స్టేట్ వర్క్ షాప్​లో ఈ మేరకు ఆ పార్టీ నిర్ణయం ప్రకటించింది. డిసెంబర్ 1న మండల స్థాయిలో బైక్ ర్యాలీలు చేపట్టాలని, 2న అసెంబ్లీ సెగ్మెంట్లలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. 3వ తేదీన అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలు పెట్టి సర్కారు వైఫల్యాలను కనీసం కార్యకర్తలకు అయినా చెప్పాలని డిసైడ్ అయింది. అలాగే డిసెంబర్ 5న కాంగ్రెస్ సర్కారు హామీల అమలుపై చార్జిషీట్ రిలీజ్ చేయాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నది.