- ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత
- బీజేపీనే జనం ప్రత్యామ్నాయంగా చూస్తున్నరు
- వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లతో పవర్లోకి వస్తామని ధీమా
న్యూఢిల్లీ, వెలుగు: ఉద్యమ పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ తెలంగాణలో ఉనికి కోల్పోయిందని, ఆ పార్టీ పని ఖతమైందని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ‘‘రాష్ట్రాన్ని పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ 17 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసి ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. 15 చోట్ల మూడో స్థానానికే పరిమితమైంది. 8 చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయింది’’ అని తెలిపారు.
‘‘సీఎం రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ పై నెపం నెడుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తొండాట ఆడింది. అబద్ధాలు, విష ప్రచారాలు చేసినప్పటికీ బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. ఉమ్మడి ఏపీలో, గత పదేండ్లలో తెలంగాణలోనూ బీజేపీ సొంతంగా పోటీ చేసి ఇన్ని సీట్లు ఏనాడూ పొందలేదు. ఇది ఆరంభం మాత్రమే. ఇక తెలంగాణలో భవిష్యత్ అంతా బీజేపీదే” అని కిషన్రెడ్డి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో 8, లోక్ సభ ఎన్నికల్లో 8 సీట్లు గెలవడం సంతోషంగా ఉందని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్కు దశా-దిశ లేదని.. ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలి? నిధులు ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలి? అనే ఆలోచన లేదని విమర్శించారు.
బీజేపీనే ప్రత్యామ్నాయం..
బీఆర్ఎస్ పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని, కాంగ్రెస్ పాలనపై ఆరు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని కిషన్ రెడ్డి అన్నారు. అందుకే జనం బీజేపీని ప్రత్యామ్నాయంగా ఆదరించారని పేర్కొన్నారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రజాపాలన, ఇందిరమ్మ, సోనియా పాలన అంటూ రేవంత్ ఊకదంపుడు ఉపన్యాలు ఇచ్చారు. హామీలు, గ్యారంటీలతో అధికారంలోకి వచ్చారు. కానీ ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ప్రజాస్వామ్య పాలనకు బదులు ప్రజా వ్యతిరేక, మోసపూరిత పాలన వచ్చింది. ఆరు నెలల్లోనే కాంగ్రెస్ సర్కార్ పై వ్యతిరేకత పెరిగింది. కాంగ్రెస్ నేతలు వేల కోట్ల వసూళ్లకు పాల్పడుతున్నారు” అని ఆరోపించారు. తెలంగాణ నుంచి అక్రమంగా దోచుకున్న డబ్బునే దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం తరలించారని అన్నారు. ‘‘గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో ఇప్పుడు బీజేపీ పుంజుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 14 శాతం ఓట్లతో 8 స్థానాలు గెలిచిన బీజేపీ... లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 35 శాతం ఓట్లతో 8 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కు ఓటింగ్ కేవలం ఒక్క శాతమే పెరిగింది. దీన్ని బట్టి భవిష్యత్తులో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని అర్థమవుతున్నది” అని పేర్కొన్నారు.
రామమందిరం పొలిటికల్ అంశం కాదు..
అయోధ్య రామమందిరం రాజకీయ పరమైన అంశం కాదని.. తాము చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఆధారంగానే ఎన్నికలకు వెళ్లామని కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘ఈ ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన ఫలితాలు సాధించింది. బీజేపీ సొంతంగా 240 సీట్లు గెలవడం, ఎన్డీయే 293 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండడం సంతోషకరం. 140 కోట్ల జనాభాతో భిన్న సంస్కృతులు, భిన్న భాషలకు నిలయమైన దేశంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం చాలా గొప్ప విషయం. 24 ఏండ్ల తర్వాత ఒడిశాలో తొలిసారి, అరుణాచల్ ప్రదేశ్ లో రెండోసారి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాం. అలాగే ఏపీ, సిక్కింలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం” అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో తనకు అవకాశం దక్కినా, దక్కకపోయినా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటానన్నారు.