మోడీ గుజరాత్కే ప్రధానిలా వ్యవహరిస్తుండు

మునుగోడు ఎన్నికల చరిత్రలో బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎనిమిదేళ్ళ పాలనలో టీఆర్ఎస్, బీజేపీలకు చిత్తశుద్ధి ఉంటే మునుగోడు నియోజకవర్గం సస్యశ్యామలం అయ్యేదన్న ఆయన మునుగోడు ప్రజలను మోసం చేసేందుకు మరోసారి సిద్ధమవుతున్నారని విమర్శించారు. ఎన్నికల హామీలను నెరవేర్చని టీఆర్ఎస్ పార్టీని చౌటుప్పల్లో గొయ్యి తీసి పెట్టాలన్నారు. శవాల మీద రాజకీయాలు చేసేలా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఓట్లకోసం వచ్చే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలను పాతరపెట్టి.. ప్రశ్నించే గొంతుక స్రవంతిని గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. కమ్యూనిస్టులను అవహేళన చేసి మాట్లాడిన కేసీఆర్కు వారు ఎందుకు మద్దతు తెలుపుతున్నారని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా ఉద్యమాల పురిటిగడ్డ అని, సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ ఓడినా కేసీఆర్కు నష్టం లేదన్న రేవంత్ రెడ్డి.. బీజేపీకి ఈ ఎన్నికలు లైట్ అని వ్యాఖ్యానించారు. ‘కాళ్ల మొక్కుతా ప్రజాస్వామన్యాన్ని బతికించండి’ అంటూ విజ్ఞప్తి చేశారు. 

ప్రధాని నరేంద్ర మోడీ కేవలం గుజరాత్ కు మాత్రమే ప్రధానిలా వ్యవహరిస్తున్నారని, గుజరాత్ ను ఒకలా, మిగితా రాష్ట్రాలను మరోలా చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. విభజన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్ల పాలనలో దేశంలో మోడీ 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని..అందులో తెలంగాణకు 50లక్షల ఉద్యోగాలు రావాలన్నారు. బీజేపీని ఇండియా గేట్ దగ్గర ఉరి తీసినా తప్పు లేదని మండిపడ్డారు.