ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. సీఎం పేరు సస్పెన్స్..!

ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. సీఎం పేరు సస్పెన్స్..!

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 2025, ఫిబ్రవరి 19 లేదా 20వ తేదీన ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. ప్రధాని మోడీ ఫ్రాన్స్, అమెరికా విదేశీ పర్యటన ముగించుకుని శుక్రవారం (ఫిబ్రవరి 14) తిరిగి ఢిల్లీకి చేరుకోనున్నారు. మోడీ రావడంతో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ హై కమాండ్ సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 17 లేదా 18న ఢిల్లీ బీజేపీ శాసన సభాపక్ష సమావేశం నిర్వహించున్నట్లు టాక్.

ఈ భేటీకి ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి ప్రముఖులు హాజరుకానున్నారు. ఎల్పీ సమావేశంలోనే బీజేపీ శాసన సభా పక్ష నేత పేరును ఎన్నుకోనున్నారు. సీఎం అభ్యర్థితో పాటు మంత్రులు, అసెంబ్లీ స్పీకర్ పేర్లను కూడా ఖరారు చేయనున్నట్లు బీజేపీ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే బీజేపీ హైకమాండ్ వివిధ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని మొత్తం 48 మంది ఎమ్మెల్యేల్లో 15 మంది పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది.

 ఈ 15 మందిలో నుంచే 9 మంది పేర్లను.. సీఎం, మంత్రులు, స్పీకర్ పదవులకు ఫైనల్ చేయనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో విజయం దక్కడంతో సంతోషంలో ఉన్న కాషాయ పార్టీ.. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది.

సీఎం రేసులో ఉన్నది వీళ్లే..!

ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ వరుస విజయాలకు బ్రేక్‎లు వేస్తూ దాదాపు 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో గెలుపు రుచి చూసింది బీజేపీ. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో.. 48 చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. సీఎం ఫేస్‎ను అనౌన్స్ చేయకుండానే ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ.. ఫలితాలు వెలవడి వారం రోజులు కావస్తోన్న ఇంకా సీఎం పేరును ప్రకటించలేదు. దీంతో కౌన్ బనేగా నెక్ట్స్ ఢిల్లీ సీఎం అంటూ జోరుగా చర్చలు సాగుతున్నాయి. 

ALSO READ | భారత్, అమెరికా కీలక ఒప్పందం.. 2030 నాటికి 500బిలియన్ డాలర్ల వాణిజ్యం: ప్రధానిమోదీ

ఢిల్లీలో బీజేపీ స్పష్టమైన విజయం సాధించడంతో సీఎం పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. పలువురు సీనియర్ నేతలు సీఎం పదవిని ఆశిస్తున్నారు. అయితే.. సీఎం రేసులో కొందరి పేర్లు మాత్రం ముందు వరుసలో ఉన్నాయి. అందులో పర్వేష్ వర్మ ఒకరు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ స్థానం నుంచి కేజ్రీవాల్‎పై పోటీకి దిగిన పర్వేష్.. ఆప్ అధినేతను మట్టికరిపించాడు. కేజ్రీవాల్ వంటి అగ్రనేతను ఓడించడంతో పర్వేష్ వర్మ జెయింట్ కిల్లర్‎గా ఎదగటంతో పాటు సీఎం రేసులో ఆయన పేరు ముందు వరుసలో ఉంది. 

పర్వేష్ వర్మతో పాటు ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన సీనియర్ బీజేపీ నాయకుడు విజేందర్ గుప్తా, గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన బ్రాహ్మణ నాయకుడు సతీష్ ఉపాధ్యాయ్, కేంద్ర నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆశిష్ సూద్, ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఉన్న జితేంద్ర మహాజన్ కూడా సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారు. మరీ వీరిలో బీజేపీ హై కమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.