
ఆదిలాబాద్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేండ్ల పాలనలో ప్రజలపై అనేక ట్యాక్స్‌లు వేసిందని, చివరకు శవాలను కూడా వదలకుండా ట్యాక్స్ వసూలు చేసిన ఘనత ఆ పార్టీకే దక్కుతుందని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లు, కో ఆర్డినేటర్ల సమావేశానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. బీజేపీకీ మతాల గురించి తప్ప ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేదని విమర్శించారు. మోదీ ఆదిలాబాద్‌కు వచ్చి ఏమిచ్చారని ప్రశ్నించారు. ఇక్కడి సమస్యలను పరిష్కారిస్తామని హామీ ఇవ్వకుండా ప్రతిపక్షాలపై విమర్శలకే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. మూతబడ్డ సీసీఐ ఫ్యాక్టరీ, రైల్వే లైన్, ఎయిర్‌పోర్ట్ అంశాలను దాట వేశారన్నారు. పేదలను మరింత పేదలుగా తయారు చేసిందని ఆరోపించారు. మతోన్మాద బీజేపీని గద్దె దించాలని ఆమె పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి..
దేహాలు ముక్కలైనా దేశం కోసం పని చేసిన ఘనత గాంధీ కుటుంబానికే దక్కుతుందని సీతక్క పేర్కొన్నారు. దేశ భవిష్యత్ కోసం తాపత్రయ పడుతున్న కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని సూచించారు. జిల్లాలో ఉన్న అన్ని పెండింగ్ పనులను పూర్తి చేసి అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను పక్కన పెట్టినట్టే పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీని పక్కనపెట్టే సమయం వచ్చిందన్నారు. ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లోనే ఐదింటిని అమలు చేసి గ్యారంటీలకే గ్యారంటీ అని నిరూపించిందన్నారు. బీజేపీకి ఓటు వేస్తే రాష్ట్రాన్ని, మన భవిష్యత్‌ను మనమే నాశనం చేసుకున్న వాళ్లమవుతామని పేర్కొన్నారు. ఆదిలాబాద్ ఎంపీగా ఆత్రం సుగుణను గెలిపించాలని సీతక్క కోరారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ.. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బూత్ లెవెల్ ఏజెంట్లు, కోఆర్డినేటర్లు క్లస్టర్ల వారీగా ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని, భేషజాలు లేకుండా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి సత్తు మల్లేశ్, ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, పలువురు నేతలు పాల్గొన్నారు.