- ఆలేరు, హుజూర్నగర్, నల్గొండ, దేవరకొండ క్యాండిడేట్లు ఖరారు
- పెండింగ్‌లో మరో నాలుగు
- ఇప్పటిదాకా ప్రకటించిన 8 స్థానాల్లో రెండు రిజర్వుడు
- మిగితా ఆరింటిలో నలుగురు ఓసీలు, ఇద్దరు బీసీలు
- నాగార్జున సాగర్, హుజూర్‌నగర్‌లో ఇద్దరు మహిళలు
నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లాలో మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. గురువారం రెండో లిస్ట్‌లో నల్గొండ, హుజూర్నగర్, ఆలేరు, దేవరకొండ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మొత్తం 12 అసెంబ్లీ స్థానాలకుగాను 8 సీట్లకు అభ్యర్థులు ఖరారయ్యారు. దీంట్లో ఇద్దరు రిజర్వుడు అభ్యర్థులు. కాగా ఆరుగురిలో ఇద్దరు బీసీలు, నలుగురు ఓసీలు ఉన్నారు.
గురువారం ప్రకటించిన నలుగురు అభ్యర్థుల్లో మాదగో ని శ్రీనివాస్ గౌడ్ (నల్గొండ), పడాల శ్రీనివాస్ (ఆలేరు) చల్లా శ్రీలత రెడ్డి (హుజూర్నగర్), లాలునాయక్ (దేవరకొండ) ఉన్నారు.. పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున బీసీలకు ఆలేరు, నల్గొండ కేటాయించారు. ఆలేరు అభ్యర్థి శ్రీనివాస్ మున్నూరుకాపు సామాజిక వర్గం కాగా, నల్గొండ శ్రీనివాస్ గౌడ సామాజికవర్గం. బీజేపీలో ఇద్దరు మహిళలకు ఛాన్స్ దక్కింది.
నాగార్జునసాగర్, హుజూర్‌నగర్‌లో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళలు పోటీలో ఉన్నారు. కోదాడలో మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిపితే ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒకేసామాజిక వర్గానికి చెందిన ముగ్గురు మహిళలు పోటీ చేయడం విశేషం. మునుగోడు, కోదాడ, నకిరేకల్, మిర్యాలగూడ స్థానాలు పెండింగ్‌లో పెట్టారు. కోదాడ, నకిరేకల్, మిర్యాలగూడ స్థానాలను జనసేన పార్టీ అడుగుతోంది. ఇక మునుగోడు అభ్యర్థిగా చల్లమల్ల కృష్ణారెడ్డినే ప్రకటిస్తారని చెపుతున్నారు. భువనగిరి మాజీ ఎం పీ బూర నర్సయ్యగౌడ్‌ను పోటీ చేయాలని పార్టీ కోరుతోంది. కానీ ఆర్థికంగా ఎదురయ్యే సమస్యల దృష్ట్యా పోటీకి సిద్ధంగా లేరని తెలిసింది.
పార్టీకి ఆశావహుల రాజీనామా..
బీజేపీ స్ట్రాంగ్ గా ఉన్న స్థానాల్లో టికెట్ ఆశించిన ఆశావహులు పార్టీకి రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. గురువారం నాగార్జునసాగర్ నియో జకవర్గానికి చెందిన పార్టీ రాష్ట్ర నాయకుడు రిక్కల ఇంద్రసేనారెడ్డి తన రాజీనామా లేఖను అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. శుక్రవారం మరో బీసీ నేత రంజిత్ యాదవ్ సైతం పార్టీకి రాజీనామా చేస్తానని హైకమాండ్‌కు సమాచారం పంపారు.
నల్గొండ సీటు కోసం పోటీ పడ్డ డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, కన్మంత శ్రీదేవి రెడ్డికి నిరాశే ఎదురైంది. దేవరకొండ టికెట్ కోసం కల్యాణ్ నాయక్ పోటీపడినప్పటికీ హైకమాండ్ లాలూ నాయక్ వైపే మొగ్గు చూపింది. మునుగోడు కాంగ్రెస్ టికెట్ఆశించిన చల్లమల్ల కృష్ణారెడ్డి వల్ల పార్టీకి ప్రయోజనం కలుగుతుందని భావించారు. కానీ ఆయన వెంట ఆశించిన స్థాయిలో లీడర్లు పార్టీలోకి రాకపోవడంతో ఆలోచనలో పడింది.
ALSO READ : భద్రాద్రిలో చతుర్ముఖ పోటీ
రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగడి మనోహర్ రెడ్డి ఎల్బీ నగర్ టికెట్ అడిగారు. కానీ పార్టీలో నెలకొన్న విభేదాల వల్ల ఎల్బీ నగర్ సీటు దక్కలేదు. హుజూర్నగర్ నుంచి పోటీ చేస్తారని భావించిన గట్టు శ్రీకాంత్ రెడ్డి, బొబ్బా భాగ్యరెడ్డి పోటీ చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో శ్రీలతరెడ్డికి అవకాశం దక్కింది. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసొ చ్చిన లీడర్లలో పడాల శ్రీనివాస్, శ్రీలతరెడ్డి ఉన్నారు.