- బలమైన అభ్యర్థుల కోసం వెతుకులాట
- ఇతర పార్టీల నుంచి చేరికలపై గురి
- అసెంబ్లీ ఎన్నికల్లో ముంచిన జనసేన పొత్తు
ఖమ్మం, వెలుగు: ఖమ్మం లోక్ సభ సెగ్మెంట్‌లో సత్తా చాటేందుకు భారతీయ జనతాపార్టీ కసరత్తు మొదలెట్టింది. గతంలో జరిగిన పొరపాట్లను, తప్పులను సరిదిద్దుకొని ముందుకెళ్లాలని ప్రణాళిక రచిస్తోంది. ప్రత్యర్థి పార్టీలకు బలమైన పోటీ ఇవ్వాలని అందుకు బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని భావిస్తోంది. పార్టీలో చాలా కాలం నుంచి సేవలందిస్తున్న లీడర్లు ఈ సారి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కోసం ఎదురుచూస్తుండగా, బీజేపీ రిలీజ్ చేసిన ఫస్ట్ లిస్ట్ లో ఖమ్మం సెగ్మెంట్ అభ్యర్థిని ప్రకటించలేదు.
దాదాపు ఐదారుగురు అభ్యర్థులు తమ ప్రయత్నాలు చేసుకుంటుండగా, పార్టీ అధిష్టానం మాత్రం అవకాశాన్ని బట్టి ఇతర పార్టీల నుంచి బలమైన లీడర్ ను పోటీ చేయించేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగానే క్యాండిడేట్ ను ప్రకటించకుండా, చివరి నిమిషం వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు సమాచారం. ఉమ్మడి జిల్లా పరిధిలో గతేడాది బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి ముఖ్య నేతల వలసలు ఉంటాయని అంచనా వేసినా, తర్వాత పరిణామాల్లో ఆ నేతలు కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికల సమయం కావడంతో, కొత్తగా చేరికలు ఉంటాయా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది. దీన్ని బట్టే బీజేపీ అభ్యర్థి ప్రకటన ఉండే ఛాన్సు ఉంది.
అసెంబ్లీ ఎన్నికల్లో అంతంతమాత్రమే..!
మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో బీజేపీ తరచుగా కార్యక్రమాలు చేస్తూ, కార్యకర్తల బలాన్ని పెంచుకుంది. పార్టీ కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్య తర్వాత పరిణామాలతో పాటు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరైంది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్దినెలల ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపారు.
చివరకు ఎన్నికలు సమీపించిన సమయంలో జనసేన పార్టీతో అధిష్టానం పొత్తు ప్రకటించడం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మెజార్టీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీలో నిలబడడంతో కమలం కార్యకర్తలు ఢీలా పడ్డారు. ఎన్నికల ప్రచార సమయంలో ముఖ్యనేతలు ముఖం చాటేయడంతో కొద్ది ఓట్లతోనే సరిపెట్టుకుంది. ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో మొత్తం పోలైన ఓట్లలో కేవలం 1.2 శాతం ఓట్లనే తెచ్చుకొని, ఏ ఒక్క అసెంబ్లీ సీటులోనూ డిపాజిట్ దక్కించుకోలేక పోయింది.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసినా 2019 ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానంలో పోటీచేసిన బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్ల కంటే కూడా నాలుగు వేల ఓట్లు తక్కువగానే వచ్చాయి. ఈసారి మాత్రం ఆ పరిస్థితి ఉండదని, ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతో పాటు అయోధ్య రామ మందిరం ఇష్యూ తమకు ఓట్లు తెచ్చిపెడుతుందని స్థానిక బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు.
బలమైన నేత కోసం వెయిటింగ్
ప్రస్తుతం బీజేపీ టికెట్ కోసం పలువురు సీనియర్లు పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ, తమిళనాడు సహా ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డిని పార్టీ బరిలోకి దించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన దేవకి వాసుదేవరావుతో పాటు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు (జీవీ), తాండ్ర వినోద్‌రావు, మరికొంత మంది బీజేపీ టికెట్ రేసులో ఉన్నారు. కొంతమంది లీడర్లు ఇప్పటికే ఎన్నికల కార్యాలయాల్ని ప్రారంభించారు. చివరి నిమిషం వరకు వేచి చూసి, ఇతర పార్టీల నుంచి చేరికలపై క్లారిటీ వచ్చిన తర్వాతనే తమ అభ్యర్థిని ప్రకటించే ఆలోచనలో బీజేపీ ఉంది.