బీజేపీ నుంచి బరిలో సీనియర్లు..అక్టోబర్ 16 తర్వాత ఫస్ట్ లిస్ట్ 

  • కనీసం 30 మంది పేర్లతో ఈ నెల 16 తర్వాత ఫస్ట్ లిస్ట్ 
  • సీనియర్లంతా పోటీ చేయాలని దిశానిర్దేశం
  • ఇప్పటికే సెగ్మెంట్లలో కలియతిరుగుతున్న లీడర్లు
  • బరిలో ఉంటామని పార్టీ కేడర్​కు సంకేతాలు

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల బరిలో పార్టీ సీనియర్​ నేతలను నిలపాలని బీజేపీ హైకమాండ్​ భావిస్తున్నది. ఇందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, కీలక నేతల పేర్లను పరిశీలిస్తున్నది. ఇవే సంకేతాలను ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్​ చేరవేసింది. ఇందులో భాగంగానే సీనియర్లతో కూడిన మొదటి జాబితాను పార్టీ రాష్ట్ర నాయకత్వం సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపింది. దీనిపై తుది కసరత్తు చేసిన సెంట్రల్ టీం..30 నుంచి 38 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్​కు ఆమోద ముద్ర వేసినట్లు తెలిసింది. అయితే ఈ నెల 14 వరకు అమావాస్య ఉండడంతో..ఈ నెల 16 తర్వాత ఎప్పుడైనా ఈ జాబితా రిలీజ్ చేసే అవకాశం ఉంది. కొందరు సీనియర్లు పోటీకి ఆసక్తి చూపకపోవడంతో...‘మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యతజాతీయనాయకత్వానిది...మీరు ఎన్నికల్లో పోటీకి మానసికంగా సిద్ధంకండి’ అని వారికి జాతీయ నేతలు భరోసా ఇస్తున్నారు.

దీంతో ఆ సీనియర్లు కూడా అసెంబ్లీ బరిలో నిలిచేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరు నేతలైతే.. తాము అసెంబ్లీకి పోటీ చేస్తున్నామనే  సంకేతాలను తమ అనుచరులకు, పార్టీ కేడర్ కు పంపించారు. ఇంకొందరు తాము ఎక్కడి నుంచి పోటీ చేసేది కూడా ప్రకటించి.. ఆయా సెగ్మెంట్లలో కలియతిరుగుతున్నారు. దాదాపు ముఖ్య నేతలంతా తాము పోటీ చేసే నియోజకవర్గాలను  ఎంచుకున్నారు. సీనియర్లు పోటీ చేసే సెగ్మెంట్లలో సొంత పార్టీ నుంచి అంతగా పోటీలేకపోవడం, వీరి పోటీకి స్థానిక నాయకత్వం  కూడా ఏకాభిప్రాయంతో ఉండడంతో... మొదటి జాబితాలో సీనియర్ల పేర్లను చేర్చినట్లు తెలుస్తున్నది.

ముందు అసెంబ్లీ.. ఆ తర్వాత పార్లమెంట్​!

త్రిముఖ పోరులో అధికారాన్ని చేపట్టాలంటే బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని బీజేపీ హైకమాండ్​ భావిస్తున్నది. సీనియర్లంతా అసెంబ్లీకి పోటీ చేయకుండా పార్లమెంట్ వైపు చూస్తే... రాష్ట్రంలో పార్టీకి కష్టంగా మారుతుందని, ఇదే జరిగితే.. ఆ వెంటనే వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం పడుతుందని ఢిల్లీ పెద్దలు గుర్తించారు. ఇదే అంశంపై రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. అందుకే అసెంబ్లీ బరిలో సీనియర్లంతా నిలవాల్సిందేనని, ఇక్కడ గెలిచిన తర్వాత.. అవసరమైతే, అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి ఇందులో ఎవరిని పార్లమెంట్ కు పంపించాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని రాష్ట్ర నేతలకు ఢిల్లీ పెద్దలు తేల్చిచెప్పారు. 

అసెంబ్లీ ఎన్నికలపై హైకమాండ్​ ఫోకస్​

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ జాతీయ నాయకత్వం ఎంత సీరియస్ గా ఉందనేది గడిచిన పది రోజుల నుంచి చూస్తే అర్థమవుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నెల 1న మహబూబ్​నగర్​సభలో, 3న నిజామాబాద్​ సభలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొనడం.. ఈ నెల 5న పార్టీ జాతీయ సంస్థాగత  ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ప్రారంభోత్సవానికి హాజరవడం, ముగింపు సమావేశాల సందర్భంగా ఈ నెల 6  పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రావడం..  ఈ నెల 10న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదిలాబాద్ సభలో పాల్గొనడం, అదే రోజు హైదరాబాద్ లో మేధావుల సదస్సు నిర్వహించడం.. ఈ నెల 12న బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో పాల్గొనడం.. వంటివన్నీ అసెంబ్లీ ఎన్నికలను హైకమాండ్​ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు స్పష్టం చేస్తున్నాయని పేర్కొంటున్నాయి.

ALSO READ : మా వాటా మాకియ్యాల్సిందే..బీసీ నేతల అల్టిమేటం

ఇక, ఈ నెల 14 నుంచి వరుసగా రాష్ట్రానికి కేంద్ర మంత్రుల ప్రోగ్రామ్ లు ఖరారు అయ్యాయి. ఈ నెల 20 న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రానున్నారు. ఈ నెల 27న అమిత్ షా మరోసారి రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నెలాఖరులో మూడోసారి రాష్ట్రానికి ప్రధాని మోదీని రప్పించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలను హైకమాండ్​ సీరియస్​గా తీసుకోవడంతో.. మొన్నటివరకు పోటీకి నో అని చెప్తూ వచ్చిన కొందరు సీనియర్లు కూడా ఇప్పుడు సై అంటున్నారు.

హైకమాండ్​ ఆదేశాలతో.. రెడీ

బీజేపీలో మొదటి నుంచి ఉన్న సీనియర్లు 2018 ఎన్నికల్లో పోటీ చేసిన స్థానాల నుంచే ఇప్పుడూ పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి పోటీ చేసిన సీనియర్లు కూడా ఇప్పుడు బీజేపీ తరఫున తమ పాత స్థానాల నుంచే బరిలో నిలవాలని భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి, కేవలం పార్లమెంట్​కు పోటీ చేసిన నేతలు..ఇప్పుడు ఆ లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని ఏదైనా ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇటీవల ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా... చాలా మంది సీనియర్లు దరఖాస్తు చేసుకోలేదు. అయితే.. హైకమాండ్ ఆదేశాలతో వారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు.

ఫస్ట్​ లిస్టులో వీళ్ల పేర్లుండే చాన్స్​

సీనియర్లతో పాటు పార్టీలో పోటీ పెద్దగా లేని నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లతో ఫస్ట్ లిస్టును విడుదల చేసేందుకు బీజేపీ సిద్ధమవుతున్నది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫస్ట్​ లిస్టులో ఉండే పేర్లు ఇవీ... కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ , సోయం బాపూరావు, లక్ష్మణ్ , ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి .. సీనియర్ నేతలు డీకే అరుణ, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి, మురళీధర్ రావు, బూర నర్సయ్య గౌడ్​, కొండా విశ్వేశ్వర్ రెడ్డి  

జయసుధ, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వెంకటరమణా రెడ్డి, బాబూమోహన్, ఆచారి, చింతల రాంచంద్రారెడ్డి, చిత్తరంజన్ దాస్, బొడిగె శోభ, అందెల శ్రీరాములు యాదవ్ , కూన శ్రీశైలం గౌడ్ , ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ , మర్రి శశిధర్ రెడ్డి, సంకినేని వెంకటేశ్వర్ రావు, గూడూరు నారాయణరెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, విజయరామారావు, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, చందుపట్ల కీర్తిరెడ్డి, కుంజా సత్యవతి, పాల్వాయి హరీశ్​ రావు, పాయల్ శంకర్ , శ్రీదేవి, రఘునాథ రావు, అరుణ తార, అన్నపూర్ణమ్మ లేదా ఆమె కుమారుడు మల్లికార్జున్ రెడ్డి, బొమ్మ శ్రీరాం.