విశ్లేషణ: మొదాలు వడ్లు కొను.. రాజకీయ డ్రామా ఎన్కశీరి

రైతులు పండించిన ప్రతి గింజ కొంటామని ఒకసారి, వరి వేస్తే ఉరే అని మరోసారి, కేంద్రం వడ్లు కొంటలేదని ఇంకోసారి.. ఇట్లా పొంతనలేని మాటలతో సీఎం కేసీఆర్ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారు. వడ్లు కొనడం చేతగాక.. కేంద్రం కొంటలేదని బద్నాం చేస్తున్నరు. నిజానికి కేంద్ర ప్రభుత్వం ఎఫ్​సీఐ ద్వారా కొనేది వడ్లు కాదు, బియ్యం. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి వడ్లు కొని బియ్యం పట్టించి ఇవ్వాలి. ఇందుకు అవసరమయ్యే నిధులు మొత్తం కేంద్రమే ఇస్తుంది. ఈ ప్రక్రియ ఏండ్లుగా జరుగుతున్నది. బాయిల్డ్​రైస్​ వినియోగం తగ్గిందని బాయిల్డ్​రైస్​కు బదులు రా రైస్​ఇవ్వాలని, ఈ మేరకు మిల్లుల అప్​గ్రేడేషన్​చేసుకోవాలని ఎఫ్ సీఐ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది. ఆ స్టేట్​మెంట్​ను మరో విధంగా మార్చి కేంద్రం యాసంగిలో వడ్లు కొనదట అంటూ దుష్ప్రచారం చేస్తున్నరు. మిల్లర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర సర్కారు రైతులను గందరగోళంలోకి నెట్టేస్తోంది. ఓ దిక్కు వానలు పడి కొనుగోలు సెంటర్లలో వడ్లు మొలకలొస్తుంటే.. జల్ది కొనాలన్న సోయి లేకుండా.. ధర్నాల పేరుతో వడ్ల కొనుగోళ్లను రాజకీయం చేస్తోంది.

దేశవ్యాప్తంగా 2020-–21 లో 600.78 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే అందులో 94.54 లక్షల టన్నులతో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానం,135.89 లక్షల టన్ను లతో పంజాబ్​మొదటి స్థానంలో ఉంది. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020–-21 రబీ సీజన్‌‌‌‌కు సంబంధించి పంపించాల్సిన మిగులు బియ్యంలో 24.75 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని మాత్రమే పంపి, మిగిలినవి ముడి బియ్యాన్ని పంపాలని ఎఫ్ సీఐ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. అయితే సర్కారు అభ్యర్థన మేరకు 24.75 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యానికి అదనంగా మరో 20 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని తీసుకోవడానికి మోడీ ప్రభుత్వం అంగీకరించింది. భవిష్యత్తులో ఎఫ్​సీఐకు ఉప్పుడు బియ్యాన్ని పంపించమని ఈ ఏడాది అక్టోబర్ 4న రాష్ట్ర ప్రభుత్వమే లేఖ పంపింది. ఆగస్టు17న కేంద్ర ఆహార, పౌరసరఫరాల కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్రాల సివిల్​సప్లయ్స్ కార్యదర్శులతో జరిగిన సమావేశంలో 2021-–22 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్​కు సంబంధించి తెలంగాణ నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించడానికి నిర్ణయం తీసుకుంది. ఈ సేకరణ అక్టోబర్ నుంచి జనవరి 2022 వరకు ఉంటుంది. సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్​సీఐకి ఇవ్వడానికి జులై 2022 వరకు కాలపరిమితిని విధించింది. 2021–-22 రబీ సీజన్ వరి ధాన్యం సేకరణ అంచనాను ఫిబ్రవరి/మార్చి 2022 లో జరిగే సమావేశంలో నిర్ణయిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో 24.91 లక్షల హెక్టార్లలో వరి సాగు చేశామని, 108.78 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తుందని కంటితో చూసి అంచనా వేసిన లెక్కలను కేసీఆర్​సర్కారు సెప్టెంబర్ 29న కేంద్రానికి పంపింది. ఈ ఏడాది ఖరీఫ్​లో వరి పంట అత్యధిక మొత్తంలో సాగైందని, ఖరీఫ్ లో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ లక్ష్యాన్ని 90 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని కోరుతూ అక్టోబర్13న తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ(డీ.ఓ లెటర్ నం. వీ(1)/1161/2021-ఎం) రాశారు. అయితే ఆగస్టు17న ఆహార కార్యదర్శులతో జరిగిన సమావేశంలోనే చెప్పకుండా, మీటింగ్​జరిగిన రెండు నెలల తరువాత, సేకరణ లక్ష్యాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్రం ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కోసం నిర్దేశించిన అంచనా లెక్కల ప్రకారం16.90 లక్షల హెక్టార్లలో వరి ధాన్యాన్ని పండిస్తే, తద్వారా ఉత్పత్తి అయ్యే బియ్యం విలువ అంచనా 54.27 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. కానీ రాష్ట్ర ప్రభుత్వం అంతకంటే ఎక్కువ మొత్తంలో సాగైనట్లు చెబుతోంది. ఈ మేరకు టీఆర్ఎస్ సర్కార్ అభ్యర్థనకు స్పందిస్తూ.. కేంద్ర ఆహార, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ తెలంగాణలో ఈ ఏడాది ఖరీఫ్ వరి ధాన్యం ఉత్పత్తికి సంబంధించిన లెక్కలను తేల్చాలని కేంద్ర వ్యవసాయ గణాంకాల శాఖను సెప్టెంబర్ 29న కోరింది. రాష్ట్రంలో 16.90 లక్షల హెక్టార్లలో వరి సాగైందని, తద్వారా 54.27 లక్షల మెట్రిక్​టన్నుల ధాన్యం వస్తుందని గణాంకాల శాఖ రిమోట్​సెన్సింగ్​టెక్నాలజీ ద్వారా తేల్చింది. ఇదే విషయాన్ని అక్టోబర్11న కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. ఈ మేరకు ఆగస్టు 17న అన్ని రాష్ట్రాల కార్యదర్శుల సమావేశంలో నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం ధాన్యం సేకరించడానికి కేంద్రం కట్టుబడి ఉంది.

కొనుగోళ్లు ఆలస్యం చేస్తూ..

ఈ ఖరీఫ్ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 6,670 ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఎక్కడా కొనుగోళ్లు వేగంగా నడుస్తలేవు. రాబోయే అన్ని రాష్ట్రాల సివిల్​సప్లయ్​కార్యదర్శుల సమావేశంలో నిర్ణయించే లక్ష్యం ప్రకారం.. 2021–-22 రబీ సీజన్ లో కూడా తెలంగాణ నుంచి బియ్యం సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2020–-21 ఏడాదిలో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి జరిగితే తద్వారా వచ్చిన 94 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రం సేకరించింది. టీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు రైతులు గుర్తొచ్చారట. రైతు సంక్షేమం అంటూ మాట్లాడుతున్నారు. ఓవైపు వానకాలం వడ్ల సేకరణ ఇంకా ఊపందుకోలేదు. వర్షాలు పడి ధాన్యం నానుతోందని రైతులు ఆవేదనం చేస్తుంటే.. వడ్లు కొనాల్సింది పోయి.. యాసంగి గురించి మాట్లాడుతూ అన్నదాతలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. టీఆర్ఎస్ సర్కార్ ఇప్పటి వరకు 7 శాతం ధాన్యాన్నే సేకరించింది.  ఇంకా రెండు నెలలే టైమ్​ఉన్నది. ఈ అక్టోబర్ నుంచి జనవరిలోగా కొనుగోలు పూర్తి చేయాలి. ఈ వేగంతో సాగితే అమ్మకాలు జనవరిలోగా పూర్తయితాయా..? ఈ విషయంలో తొందరగా సేకరించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు చెప్తుంటే సేకరించలేని అసమర్థతలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం యాసంగి పంట గురించి మాట్లాడుతూ, రైతులను తప్పుదోవ పట్టిస్తూ.. కేంద్రంపై దుమ్మెత్తి పోస్తోంది. వడ్లు కొనుగోళ్లు ఆలస్యం చేయడం వల్లే ఇప్పటికే ఐదుగురు రైతులు చనిపోయారు. అయినా కేసీఆర్ ప్రభుత్వం కళ్లు తెరుస్తలేదు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన రైతు తన వడ్లను ఇక కొనరేమో అని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దుబ్బాక నియోజకవర్గంలో కూడా ఒక రైతు వరికుప్ప మీదనే గుండె ఆగి మృతిచెందాడు. ఏడేండ్ల నుంచి మేమే ధాన్యం కొంటామని చెప్పుకున్న కేసీఆర్.. ఇప్పుడు ధాన్యాన్ని కేంద్రమే కొంటుందన్న విషయాన్ని బయటపెట్టారు. ఈ విషయం ఇన్నాళ్లూ ఎందుకు చెప్పలేదు?

కోటి ఎకరాల మాగాణి అని..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే కోటి ఎకరాల మాగాణి కావాలన్న సీఎం కేసీఆర్​ఇప్పుడు ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. నీళ్లు తెచ్చింది వరి కోసం కాదు ఇతర పంటలు వేసుకోవాలంటున్నారు. పోనీ ప్రత్యామ్నాయ పంటల విత్తనాలకు సబ్సిడీ ఇచ్చి అందుబాటులో ఉంచారా అంటే అదీ లేదు. ఇలా రైతులను అనేక రకాలుగా మభ్యపెడుతున్నారు. తెలంగాణలో ఉత్పత్తి అయిన పత్తిని మొత్తం సీసీఐ కొంటోంది. పత్తి కొనుగోళ్లలో లేని సమస్య వడ్లకు ఎందుకు వస్తుందో కేసీఆర్ ప్రభుత్వమే చెప్పాలి. కేంద్రం పారాబాయిల్డ్ బియ్యం కొనం అంటే దానికి విపరీతార్థాలు తీసి కేంద్రం కొనదంటూ తప్పుడు ప్రచారం చేశారు. పారా బాయిల్డ్ రైస్ వినియోగం తగ్గిందని, రా రైస్​ఇవ్వడానికి మిల్లర్లను టెక్నాలజీ అప్ గ్రేడ్ చేసుకోవాలని, అప్ గ్రేడ్ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించాలని ఎఫ్ సీఐ చెప్తున్నా.. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సమస్య తెలంగాణకే ఎందుకు వస్తుందో రైతులకు చెప్పాలి.

ధర్నా చౌక్​ అప్పుడు ఎత్తేసి..

రాష్ట్రంలో ఎలాంటి ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు ఉండకూడదని ప్రభుత్వం ఇందిరా పార్క్ దగ్గర ధర్నాచౌక్ ను ఎత్తేసింది. ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పినా వినలేదు. రాజ్యాంగం ప్రసాదించిన నిరసన తెలిపే హక్కును కేసీఆర్ ప్రభుత్వం కాలరాసింది. ఇప్పుడు మాత్రం అదే ధర్నా చౌక్​లో ఆందోళనలు చేపడుతూ.. రైతులపై ప్రేమ ఉన్నట్లు టీఆర్ఎస్​నటిస్తోంది. హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ గెలుపు తర్వాత దెబ్బతిన్న టీఆర్​ఎస్​పార్టీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కొత్త  రాగం మొదలుపెట్టింది. ఈటల రాజేందర్ గెలుపును చిన్నదిగా చేయడం కోసం, బీజేపీ గెలుపు ఉత్సాహాన్ని నీరు గార్చి, పార్టీ విస్తరణను అడ్డుకోవడం కోసం కుట్రలు చేస్తోంది. బీజేపీ ఎక్కడ మేకు అవుతుందోనని  వరి అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చి రాజకీయ క్రీడకు తెరతీసింది. కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ధాన్యం పరిశీలించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటనలను టీఆర్​ఎస్​నేతలు అడ్డుకోవడం, దాడికి పాల్పడటం సిగ్గుచేటు. 2017 ఏప్రిల్​లో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డ్ దగ్గర పంటను కొనుగోలు చేయాలంటూ ధర్నాకు దిగిన మిర్చి రైతులకు బేడీలు వేసింది టీఆర్ఎస్​ప్రభుత్వమే అన్నది గుర్తుంచుకోవాలి. దొడ్డు వడ్లు వద్దు.. సన్న వడ్లు పంపించండి అని రైతులను గోస పెట్టింది, సన్న వడ్లకు రూ.150 ఎక్కువ ఇస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇయ్యనిది ఈ ప్రభుత్వమే. ఉచిత ఎరువులు ఇస్తానని ముచ్చట్లు చెప్పి మోసం చేసింది, క్రాప్‌ లోన్ పైన వడ్డీ రాయితీ ఇవ్వకుండా, ఇప్పటిదాకా రైతులకు రుణమాఫీ చేయకుండా కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నది టీఆర్ఎస్​ప్రభుత్వమే అన్నది వాస్తవం కాదా? భూసార పరీక్షల కోసం కేంద్రం నిధులిస్తే.. పరీక్షలు చేయించలేదు, ఫసల్ బీమా యోజన తీసుకొస్తే ఆ పథకాన్ని అమలు చేయడం లేదు. రైతులు నిజానిజాలు గమనించాలి. వాస్తవానికి కేంద్రం ధాన్యం ద్వారా బియ్యం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనేందుకు నిధుల్లేవు. గతంలో తీసుకున్న అప్పులు కూడా చెల్లించలేదు. అందుకే ధాన్యం కొనలేక కేంద్రాన్ని బద్నాం చేస్తూ.. ధర్నాల పేరుతో, దాడులతో కొత్త డ్రామాలకు తెరదీసింది.

- డా. కె. లక్ష్మణ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు