హైదరాబాద్లో నాలాల నిర్మాణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్లే నాలా వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి విమర్శించారు.ఎల్బీనగర్ నియోజకవర్గం గడ్డి అన్నారం డివిజన్ లో అర్బన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి,స్థానిక కార్పొరేటర్ మహేశ్వర్ రెడ్డి తో కలిసి ఆయన పర్యటించారు.
మంత్రి కేటీఆర్ విదేశాల్లో నేర్చుకున్న విద్యతో ప్రజలను గారడీ చేస్తున్నారని పని చేయకుండా పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. కేటీఆర్ విదేశాల నుంచి వచ్చిన యాక్టింగ్ మినిస్టర్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తాను ఎమ్మెల్యే గా వున్నప్పుడు సరూర్ నగర్ చెరువు కింది కాలనీల లో పైప్ లైన్ వేసినట్లు చెప్పారు.ఇప్పుడు వాటి నిర్వహణ లో యంత్రాంగం అలసత్వం వహించిన నేపథ్యంలో వాటిలో సిల్ట్ నిండిపోయి పొంగిపొర్లుతున్నాయని తెలిపారు.
అధికారులు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నిర్లక్ష్యం వల్లే హైదరాబాదులో ఈ స్థితికి వచ్చిందని మండిపడ్డారు. డబ్బులు సంపాదించాలనే ఆలోచన తప్ప,సమస్యలు పరిష్కరించాలనే ఆలోచన కేటీఆర్ కు లేదని ఎద్దేవా చేశారు.వర్షాలు పడ్డపుడల్లా కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటూ వరద సమస్య ఎదుర్కొంటున్నారని అన్నారు.