బీజేపీ టెర్రరిస్టుల పార్టీ.. మోదీపై నిప్పులు చెరిగిన మల్లికార్జున్ ఖర్గే

బీజేపీ టెర్రరిస్టుల పార్టీ.. మోదీపై నిప్పులు చెరిగిన మల్లికార్జున్ ఖర్గే

కాంగ్రెస్ పార్టీని 'అర్బన్ నక్సల్' నియంత్రిస్తోందన్న ప్రధాని నరేంద్ర మోదీ వాదనను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రధానికి అలవాటుగా మారిందన్న ఖర్గే.. బీజేపీ టెర్రరిస్టుల పార్టీ అని కౌంటర్ ఇచ్చారు.

"ప్రధాని(నరేంద్ర మోదీ) ప్రతిసారి కాంగ్రెస్ పార్టీపై అర్బన్ నక్సల్ పార్టీ అంటూ ముద్ర వేస్తున్నారు. ప్రగతిశీల వ్యక్తులను అర్బన్ నక్సల్స్ అని పిలుస్తున్నారు. ఇది ఆయనకు అలవాటుగా మారింది. మరి ఆయన పార్టీ మాటేమిటి? బీజేపీ తీవ్రవాదుల పార్టీ. వారు హత్యలు చేస్తారు. ప్రజలపై దాడులు చేస్తారు షెడ్యూల్డ్ వ్యక్తుల నోటిలో మూత్ర విసర్జన చేస్తారు. అది వారి పార్టీ చేసే పని. కాంగ్రెస్‌ పార్టీపై ఆరోపణలు చేసే హక్కు ఆయనకు లేదు.." అని ఖర్గే విమర్శించారు.

మోదీ ఏమన్నారంటే..?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆక్టోబర్ 5న విదర్భలో పర్యటించిన మోదీ.. కాంగ్రెస్‌పై పలు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీని అర్బన్ నక్సల్స్‌ గ్రూప్ కంట్రోల్ చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ ప్రమాదకర ఎజెండాను కలిసికట్టుగా తిప్పికొట్టాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలను సమష్టిగా తిప్పికొట్టేందుకు ఇదే తగిన సమయమని వ్యాఖ్యానించారు. ఇటీవల హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయానంతరం కూడా మోదీ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో బీజేపీ విజయం సాధించడం ద్వారా కాంగ్రెస్, అర్బన్ నక్సల్స్ విద్వేషపూరిత కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని అన్నారు.