స్థానిక సంస్థ ఎన్నికల్లో ఒంటరిగానే బీజేపీ పోటీ.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పోటీపై కేంద్ర మంత్రి, టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. అలాగే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకంపైన కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధ్యక్షుడిగా ఎంపిక కావాలంటే తప్పకుండా ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్‌ ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. రెండుసార్లు బీజేపీ క్రియాశీలక సభ్యత్వం ఉన్న చాలు లేదా రెండుసార్లు బీజేపీ గుర్తుపై పోటీ చేసినా సరిపోతుందని క్లారిటీ ఇచ్చారు. 

మేడ్చల్ ఎంపీ ఈటల రాజేందర్ కూడా బీజేపీ అధ్యక్ష రేసులో ఉంటారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్ఠానమే నిర్ణయిస్తుందని.. హైకమాండ్ డెసిషనే ఫైనల్ అని తేల్చి చెప్పారు. కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎవరో అందరికి తెలుసని.. అదే బీజేపీ తర్వాత అధ్యక్షుడు ఎవరో బీఆర్ఎస్ చెప్పగలదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్‎లో నిర్ణయాలు డైనింగ్ టేబుల్‎పై జరుగుతాయని ఎద్దేవా చేసిన కిషన్ రెడ్డి.. బీజేపీలో అలా కాదని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నాడని.. అసలు రేవంత్ రెడ్డి చెబితే ఢిల్లీ ప్రజలకు కాంగ్రెస్‎కు ఓటేస్తారా అని నిలదీశారు.

ALSO READ | స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి

 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఉచితాలకు బీజేపీ వ్యతిరేకం  కాదని.. కానీ ప్రజలను మోసం చేయకుండా రాష్ట్ర ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని హామీలు ఇవ్వాలని సూచించారు. అలా కాకుండా అడ్డగోలు హామీలు ఇచ్చి రాష్ట్రాని దివాలా తీయించే పరిస్థితులు తీసుకురావొద్దని సూచించారు. ఇక, నిజామాబాద్‎లో కాంగ్రెస్ వల్లే జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు అయ్యిందన్న కాంగ్రెస్ నాయకులను ఈడ్చి కొట్టాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు కిషన్ రెడ్డి.