తెలంగాణలో ప్రత్యామ్నాయం కాకుండా ప్రజాధికారం కల్ల!

తెలంగాణలో ప్రత్యామ్నాయం కాకుండా  ప్రజాధికారం కల్ల!

తెలంగాణలో బీజేపీ తరచూ ఒక సమస్యను ఎదుర్కొంటోంది.  ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ప్రజావిశ్వాసం పొందడంలో దారుణంగా విఫలమవుతోంది. ఆ కారణంగానే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో విఫలమైనట్టే.. ఇప్పుడు ప్రతిపక్షపాత్ర పోషిస్తూ స్థానిక సంస్థల్లో బలపడే అవకాశాన్నీ జారవిడుచుకుంటోంది. 8 మంది ఎంపీలు, మరో 8 మంది ఎమ్మెల్యేలుండీ పార్టీ ప్రజాక్షేత్రంలో ఉనికిని వెతుక్కుంటోంది. పార్టీ సంస్థాగత ఎదుగుదలకు స్థానికసంస్థల ఎన్నికలను ఒక సావకాశంగా వాడుకునే యోచనే బీజేపీ నాయకత్వానికి ఉన్నట్టు లేదు. పాత-కొత్త శ్రేణుల మధ్య స్పర్ధ,  గ్రూపు తగాదాల నడుమ కొత్త అధ్యక్ష నియామకం జరపలేక ఢిల్లీ అధినాయకత్వం తలపట్టుకుంటోంది. 

రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏమిటి?

పార్లమెంట్​ఎన్నికల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీ ఇంకొంచెం మెరుగైన ప్రదర్శన ఇచ్చినా.. మరో మూడు  లోక్‌‌‌‌‌‌‌‌సభ స్థానాలు తమకు ఎక్కువ లభించి ఉండేవనేది తెలంగాణ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ భావన. మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, మెదక్‌‌‌‌‌‌‌‌, సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ వంటి స్థానాలు అలా చేజారినవే అనేది వారి అంతర్గత విశ్లేషణ. ఎవరి అంచనాలకూ అందనంతగా ఆయాస్థానాల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అధ్వాన్నపు ప్రదర్శన ఇచ్చింది.  దాంతో ఆ స్థానాలు బీజీపేకి దక్కాయి. రాష్ట్రంలో  8 కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు లభించగా, అందుకు సమాన సంఖ్యలో 8 స్థానాలు బీజేపీ గెలిచిన విషయం తెలిసిందే! మిగిలిన ఒక స్థానం ఎంఐఎం గెలుచుకుంది. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు ఒక స్థానమైనా దక్కలేదు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధిష్టాన ప్రతినిధి బృందం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ వచ్చి ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరిపినపుడు, బీజేపీ-, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కుమ్మక్కవడం వల్లే తాము ఇంకొన్ని స్థానాలు గెలవలేకపోయామని స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆ బృందానికి చెప్పారు. బయటకు ఇలా చెప్పినా.. అంతర్గతంగా వారి భావన మాత్రం బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పూర్తిగా చేతులెత్తేయడమే బీజేపీకి లాభించిందని. నిజంగా బీజేపీకి రికార్డు సంఖ్యలో 8 స్థానాలు అయాచితంగానే లభించాయా? అది బీజేపీ నిజమైన బలం కాదా?  నిజమైన బలమే అయిఉంటే, మరి అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, ‘అధికారంలోకి వస్తాం’ అనుకున్న పార్టీ విజయం కేవలం 8 (8/119) స్థానాలకే ఎందుకు పరిమితమౌతుంది? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది.  సంస్థాగతంగా బలపడకపోవడం, అధికారంలో  ఉన్న పార్టీకి  బీజేపీ ప్రత్యామ్నాయం  అన్న భావన ప్రజల్లో కల్పించలేకపోవడమే తెలంగాణలో పార్టీ స్థిరంగా ఎదగకపోవడానికి కారణం. 

ప్రజాసమస్యలపై పోరాటం మర్చిపోయారా?

అసంపూర్తి రుణమాఫీ, ఆగిపోయిన రైతుబంధు,  హైడ్రా ప్రకంపనలు, పెరగని పెన్షన్‌‌‌‌‌‌‌‌ మొత్తాలు,  ఇంకారాని రేషన్‌‌‌‌‌‌‌‌కార్డులు, ఇలా పలు ప్రజాసంబంధ వ్యవహారాల్లో పార్టీ విపక్షపాత్ర పోషించలేకపోతోంది. విలేకరుల సమావేశాలు, పత్రికా ప్రకటనలు తప్ప ప్రజాక్షేత్రంలో జనంతో కలిసి జరిపే కార్యక్రమాల ఎజెండానే బీజేపీ మరిచిపోయిందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమౌతోంది.  లోగడ  అధ్యక్షుడిగా  ఉన్న  బండి సంజయ్‌‌‌‌‌‌‌‌,  ప్రస్తుత అధ్యక్షుడు కిషన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి.. ఇద్దరూ కేంద్ర మంత్రులుగా ఉన్నా పార్టీ  బలోపేతానికి  జరుగుతున్న కృషి ఏమీ లేకపోవడం పట్ల పార్టీ లోపల, బయట విస్మయం వ్యక్తమౌతోంది. దుబ్బాక, హూజూరాబాద్‌‌‌‌‌‌‌‌ ఉప ఎన్నికల్లో, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ మహానగర ఎన్నికల్లో సానుకూల విజయాలకు కారణం నాటి స్థానిక పరిస్థితులు, రాజకీయ సమీకరణాలు, అభ్యర్థులే తప్ప నాయకత్వ ప్రతిభ కాదని తర్వాతి పరిణామాలు తేల్చాయి.  

నాయకత్వ గొప్పతనమే అయితే, నాయకులు స్వయంగా ప్రాతినిధ్యం వహించిన లోక్‌‌‌‌‌‌‌‌సభ నియోజకవర్గాల పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పార్టీ ఎందుకు ఓడింద‌‌‌‌‌‌‌‌నే ప్రశ్న తలెత్తుతోంది. బీజేపీ రాష్ట్ర, కేంద్ర నాయకత్వాలకు పార్టీపరమైన సొంత ఎజెండా కూడా లేనట్టు కనిపిస్తోంది. ఉత్తరాదిన చెల్లుబాటయ్యే మత ఉద్వేగాలు దక్షిణాదిలో,   ముఖ్యంగా  కమ్యూనిస్టు ఉద్యమాల నేపథ్యమున్న తెలంగాణలో ఎన్నికల రాజకీయాలకు పనికిరావు.  బెంగాల్‌‌‌‌‌‌‌‌లో చేసిన తప్పునే  పార్టీ నాయకత్వం తెలంగాణలో పునరావృతం చేస్తున్నట్టుంది.

కుములుతున్న యంత్రాంగం

సభ్యత్వ నమోదు వంటివి తప్ప, పార్టీ కింది స్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేసే మరో సంస్థాగత కార్యక్రమమే ఉండటం లేదని బీజేపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ప్రజాందోళనల ఎజెండా లేకపోవడాన్నీ వారు తప్పుబడుతున్నారు.  కూర్చొని రసీదు పుస్తకాల్లో నింపే సభ్యత్వాలు బోగస్‌‌‌‌‌‌‌‌ అనే అభిప్రాయం ఉంది.  ఒక ఊరో,  మండలమో,  నియోజకవర్గమో ప్రాతిపదికగా తీసుకొని, ఏదైనా ఎన్నికలో... సభ్యత్వాలున్నన్ని ఓట్లయినా పడుతున్నాయో?  లేదో?  తనిఖీ చేస్తే వ్యవహారం  తేటతెల్లమౌతుంది.  కనీసం ఆ జాగ్రత్త తీసుకున్నా  పార్టీ బాగుపడుతుందనే  అభిప్రాయం అంతర్గతంగా ఉంది.  

ప్రతి ఎన్నికలప్పుడూ చెప్పే బూత్‌‌‌‌‌‌‌‌ స్థాయి కమిటీలు, వాటి నిర్మాణం-, భేటీలు, కార్యాచరణ అన్నది ఎప్పటికీ నెరవేరని కలగానే ఉండటంతో.. ఆ మాట చెప్పినపుడల్లా పార్టీ శ్రేణుల్లో అదొక బూతులాగే ధ్వనిస్తోందని ఓ సామాన్య కార్యకర్త చేసిన వ్యాఖ్య పరిస్థితికి అద్దం పడుతోంది.  ఒకప్పుడు ఎంతో  చైతన్యంగా ఉండిన యువ మోర్చా,  మహిళా మోర్చా, దళిత మోర్చా వంటి అనుబంధ విభాగాలు  క్రియాహీనంగా తయారయ్యాయి. వాటిని నిర్మాణ- కార్యకలాపాలపరంగా బలోపేతం చేసే ఏ ప్రయత్నమూ జరగటం లేదు. ప్రజాసమస్యలు పెద్దగా పట్టని జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ కార్పొరేటర్ల పనితీరు ‘ఎవరికి వారే యమునా తీరే!’  వారి పట్ల ఎవరికీ సంస్థాగతమైన అదుపూ లేదు,  ఆజమాయిషీ లేదు. పెద్దసంఖ్యలో కార్పొరేటర్లున్నా మహానగర  పరిధిలో  కనీసం ఒక అసెంబ్లీ సీటయినా గెలవకపోవడాన్ని పార్టీ ఎప్పుడూ ఒక లోపంగానే పరిగణిస్తోంది.  ‘ఎంపీ,  ఎమ్మెల్యే  స్థానాల కోసం వ్యూహ రచన చేస్తారు, పార్టీ కిందిస్థాయి నాయకత్వాన్ని పటిష్టపరిచే స్థానిక సంస్థల ఎన్నికల పట్ల సోయే లేకపోవడం దారుణం’ అన్న ఓ మండల స్థాయి బీజేపీ నాయకుడి మాట వారి మనోస్థితిని వెల్లడిస్తుంది. 

సఖ్యత, సయోధ్య నిల్‌‌‌‌‌‌‌‌

బీజేపీ 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ రాష్ట్రస్థాయి నాయకత్వంతో కలిసి కూర్చున్న బహిరంగ వేదికకుగానీ, అంతర్గత సమావేశానికిగానీ  ఇంతవరకు సందర్భం వచ్చినట్టు లేదు.  సీనియర్‌‌‌‌‌‌‌‌ నాయకుడు  కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, లోక్‌‌‌‌‌‌‌‌సభ  ఎన్నికల  తర్వాత  కేంద్ర కేబినెట్‌‌‌‌‌‌‌‌ మంత్రిగా మళ్లీ  బాధ్యతలు చేపట్టాక పార్టీ రాష్ట్ర విభాగానికి కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి ఉంది.  అది జరగకపోవడంతో ఇంకా ఆయనే కొనసాగుతున్నారు. బయటి నుంచి వచ్చి చేరిన ముఖ్యులు, పార్టీలోనే  ఎదిగిన సీనియర్లకు మధ్య స్పర్ధ  నిరంతరం కొనసాగుతోంది.  ప్రత్యర్థులపై ఫిర్యాదులు చేస్తూ గ్రూపులు బలంగా పనిచేస్తున్నాయి. ఈ పరిణామాల వల్లే కొత్త అధ్యక్ష నియామకం జరపలేక అధినాయకత్వం తలపట్టుకుంటోందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తమౌతోంది. రికార్డు సంఖ్యలో పార్టీకి ఎంపీలు, ఎమ్మెల్యేలున్నా... పార్టీ శ్రేణుల్లో ఆ ఉత్సాహం లేదు. ప్రజల్లో పార్టీ కూడా అంతగా నానటం లేదు. 

ప్రజాభిప్రాయం మారలేదు

బీజేపీ-, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఒకటే,  నేడు కాకుంటే రేపయినా వారు కలిసే ఉంటారనే భావన ఇప్పటికీ జనక్షేత్రంలో బలంగానే ఉంది.  2022–23లో బలంగా కనిపించిన బీజేపీ సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు చతికిలపడింది. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అనూహ్యంగా పుంజుకుంది.  ఒక్కసారిగా ఎందుకలా జరిగింది?  అప్పటివరకూ  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌  ప్రభుత్వానికి వ్యతిరేకంగా  బలపడుతున్న  ప్రజాభిప్రాయం  ప్రత్యామ్నాయాల కోసం వెతికింది. ‘2014, 2018 ఎన్నికల్లో లాగానే.. గెలిపించినా,  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేలు  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో కలుస్తారేమో?’ అని సందేహించిన మెజారిటీ ప్రభుత్వ వ్యతిరేకులు, బీజేపీని ప్రత్యామ్నాయ పార్టీగా చూశారు. అందుకే, ఆ పార్టీకి అంత ఊపు కనిపించింది. ఎలాగైనా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ని గద్దె దించాలని ప్రజాభిప్రాయాన్ని బలోపేతం చేస్తున్న క్రమంలోనే వారికొక సందేహం మొదలైంది. బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఒకటేనేమోననే వారి సందేహం బలపడుతున్న క్రమంలోనే.. ‘బీజేపీ కాదు, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీయే అసలైన ప్రత్యామ్నాయం’ అనే  అభిప్రాయానికి వచ్చిన వెంటనే జనమంతా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీనే ప్రత్యామ్నాయంగా భావించడంతో ఆ పార్టీ గ్రాఫ్‌‌‌‌‌‌‌‌ అనూహ్యంగా పెరిగింది.

- దిలీప్‌‌‌‌‌‌‌‌రెడ్డి
పొలిటికల్‌‌‌‌‌‌‌‌ అనలిస్ట్‌‌‌‌‌‌‌‌, 
పీపుల్స్‌‌‌‌‌‌‌‌పల్స్‌‌‌‌‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌ సంస్థ