
- క్రమంగా బలపడుతున్న కాషాయ దళం
- వరుస దెబ్బలతో గులాబీ లీడర్ల బెంబేలు
- 3 ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేయని బీఆర్ఎస్
- ఇక ఎన్నికలన్నీ బీజేపీVs కాంగ్రెస్సేనా?
- ఐదు జిల్లాల పరిధిలో 54 అసెంబ్లీ స్థానాలు
- బీఆర్ఎస్ గెలిచింది 12 అందులోంచి నలుగురు జంప్
- బీజేపీకి ఏడు సెగ్మెంట్లు..కాంగ్రెస్ గెలిచింది 35
- ఎంపీ ఎన్నికల్లో కారు జీరో.. బీజేపీకి 3, కాంగ్రెస్ 4
- పూలమ్మిన చోటే కట్టెలమ్ముతున్న గులాబీ పార్టీ
హైదరాబాద్: ఉత్తర తెలంగాణ ఉద్యమాల ఖిల్లా.. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన ఐదు జిల్లాల్లో ఇవాళ కారు పార్టీ తకరారు పడుతోంది. గులాబీ జెండా కనుమ రుగవుతోంది. గోదావరి తీరం వెంట నదీ ప్రవాహంలా సాగిన గులాబీ పార్టీ ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగ ల్, ఖమ్మం జిల్లాల పరిధిలో 54 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 35 సీట్లను సొంతం చేసుకుంది. బీఆర్ఎస్ 12, బీజేపీ ఏడు స్థానాల్లో విజయం సాధించింది.
బీఆర్ఎస్ తరఫున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వారిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), తెల్లం వెంకటరావు (భద్రాచలం), కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్ పూర్), సంజయ్ (స్టేషన్ ఘన్ పూర్) ఉన్నారు. ప్రస్తుతం ఆ పార్టీతో ఉన్నది కేవలం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. ఎంపీ ఎన్నికల్లో ఏడు స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేసి ఒక్కటీ గెలుచుకోలేక పోయింది.
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ లోక్ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ తర్వాత క్రమంగా గులాబీ పార్టీ చతికిల పడిపోయింది. ఇటీవల నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ సెగ్మెంట్ పరిధిలోని గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలోకి దించలేదు.
ఈ రెండు ఎన్నికల్లో ఓటమి చెందడంతో పోటీ చేసి ఓడిపోవడం ఎందుకని భావించే అభ్యర్థులను నిలుపలేదనే టాక్ ఉంది. ఇక్కడి నుంచి బీజేపీ నుంచి బరిలోకి దిగిన అంజిరెడ్డి, మల్క కొమురయ్య విజయం సాధించారు. కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నించినా ఇవ్వలేదు. దీంతో ఆయన ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ఉత్థాన పతనం
తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ కు అండగా నిలిచిన ఉత్తర తెలంగాణ క్రమంగా ఆ పార్టీకి దూరమరవుతోంది. ఏకగ్రీవాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటిన ఇందూరు దూరమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 9 ఎమ్మెల్యే స్థానాలకు గాను కేవలం రెండింటినే గెలుచుకుంది. అందులోనూ బాన్సువాడ నుంచి విజయం సాధించిన పోచారంర శ్రీనివాస్ రెడ్డి పార్టీకి దూరమయ్యారు.
ALSO READ | నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు షురూ..!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల, కరీంనగర్, కోరుట్ల, హుజూరాబాద్, జగిత్యాల లలో బీఆర్ఎస్ గెలిచింది. ఇందులో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీకి దూరమయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ ఘన పూర్ నుంచి కడియం శ్రీహరి, జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. వీరిలో పల్లా ఒక్కరే పార్టీలో మిగిలారు.
ఖమ్మం జిల్లాలో గెలిచిన ఒకే ఒక్క స్థానం భద్రాచలం. ఇక్కడి నుంచి గెలిచిన తెల్లం వెంకటరావు పార్టీకి దూరమయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, బోథ్ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. దీంతో ఐదు జిల్లాల్లో బీఆర్ఎస్ కు మిగిలింది కేవలం 8 మంది ఎమ్మెల్యేలే కావడం గమనార్హం.
సోషల్ మీడియా పులేనా?
పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం సోషల్ మీడియా పులిగా మారిపోయింది. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వస్తే సత్తా చాటుతామంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటలు నిజం కాబోవని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందనే విశ్లేషణలు మొదలయ్యాయి. బీజేపీ గెలుపుపై కాంగ్రెస్ స్పందన మరోలా ఉంది. బీఆర్ఎస్ లోపాయికారీ సహకారం వల్లనే బీజేపీ రెండు స్థానాలను గెలుచుకుందని, పార్ల మెంటు ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడా అమలు చేస్తోందని కాంగ్రెస్ అంటోంది.
బీజేపీ వర్సెస్ కాంగ్రెస్సేనా?
రాబోయే ఎన్నికలన్నీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే ఉండబోతున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి పలు మార్లు ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ పార్టీ లేదని చెప్పారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీయే లేదని కుండబద్దలు కొట్టారు.
భవిష్యత్తులో ఉత్తర తెలంగాణ ఊపిరందిస్తేనే బీఆర్ఎస్ ఉనికి ఉంటుందనే వాదన కూడా ఉంది. కానీ పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఉద్యమాల ఖిల్లా క్రమంగా కాషాయ జెండా వైపు ఒదిగిపోతుండటం గులాబీ శ్రేణులను కలవర పెడుతోంది.