రానున్న ఎన్నికల్లో బీజేపీదే అధికారం

ఖమ్మం టౌన్, వెలుగు: రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ తెలిపారు. ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన నిరుద్యోగ మార్చ్ ను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. నగరంలోని పార్టీ జిల్లా ఆఫీస్ లో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. అత్యధిక స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ బలహీనంగా ఉందని కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పార్టీ రాష్ట్రంలో బండి సంజయ్​ఆధ్వర్యంలో ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన కమ్యూనిస్టులు అధికార పార్టీ సంకలోకి ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. 

కేవలం రెండు సీట్ల కోసం కక్కుర్తి పడుతున్నారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర లీడర్ గంటేల విద్యాసాగర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నున్న రవికుమార్, ఉపాధ్యక్షులు మంద సరస్వతి, ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు రవి రాథోడ్, యువ మోర్చా అధ్యక్షుడు అనంత ఉపేందర్ గౌడ్, ఖమ్మం వన్ టౌన్ ప్రధాన కార్యదర్శి కొండ శ్యామ్, దార్ల శంకర్ గౌడ్, మహిళా మోర్చా వన్ టౌన్ ప్రధాన కార్యదర్శి గోలి ఫణి కుమారి, మహిళా మోర్చా లీడర్లు నాగమణి, సుగుణ పాల్గొన్నారు.