ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ

ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

ముదిగొండ, వెలుగు :  కేంద్రంలోని బీజేపీ ప్రధాని మోదీ ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి, పదేండ్లలో పదివేలు కూడా ఇవ్వలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొడుతూ మోసగిస్తోందని ఆరోపించారు. బీజేపీని ఓడించాలంటే ఆ పార్టీ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అమ్మపేటలో శుక్రవారం పార్టీ కార్యదర్శి భట్టు పురుషోత్తం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఆయన అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి అమరులకు నివాళులర్పించి మాట్లాడారు. 

కేంద్రంలో.. రాష్ట్రంలో ప్రజల కష్టాలు, కన్నీళ్లు తీర్చేది కమ్యూనిస్టు పార్టీ ఒక్కటేనన్నారు. అన్ని మతాలు కలిగిన దేశంగా భారత్ కు  గొప్ప చరిత్ర ఉందని, దాన్ని చెడగొట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా హైడ్రా పేరుతో పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో సీపీఎం మరింత పటిష్టంగా ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ మండల కార్యదర్శిగా రెండో సారి భట్టు పురుషోత్తం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సభలో  సీపీఎం రాష్ట్ర నేతలు పొన్నం వెంకటేశ్వర రావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేశ్,  చింతలచెర్వు కోటేశ్వరరావు,  నేతలు బండి పద్మ, వాసిరెడ్డి వర ప్రసాద్,  మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, మండల నేతలు టీఎస్ కళ్యాణ్,  వేల్పుల భద్రయ్య 
తదితరులు పాల్గొన్నారు.