ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ సిద్ధం
యాదగిరిగుట్ట, వెలుగు : రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ నాయకులు సుదగాని హరిశంకర్‌గౌడ్, పడాల శ్రీనివాస్ చెప్పారు. యాదాద్రి జిల్లా మోటకొండూరులో శుక్రవారం నిర్వహించిన మీటింగ్‌లో వారు మాట్లాడారు. రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతం చేయడానికి పార్టీలకతీతంగా సంఘటితం కావాలని సూచించారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు విద్యుత్ సరఫరా సక్రమంగా చేయాలని డిమాండ్ చేస్తూ మోటకొండూర్ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించి, ఆఫీసర్లకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు జోరుక ఎల్లేశ్, జిల్లా కార్యదర్శి పీసరి తిరుమల్‌రెడ్డి, నాయకులు పన్నాల చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు చిర్ర రవీందర్, నాయకులు పైళ్ల వెంకట్‌రెడ్డి, వీరమల్లు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఆదరణను ఓర్వలేకే కుట్రలు
యాదగిరిగుట్ట (బొమ్మలరామారం), వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పీసీసీ సభ్యుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య సూచించారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం యావాపూర్‌తండాలో శుక్రవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌కు వస్తున్న ఆదరణ ఓర్వలేకే టీఆర్‌ఎస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గ్రౌండ్ లెవల్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని చెప్పారు. అనంతరం పార్టీలో చేరిన పలువురికి కండువాలు కప్పి ఆహ్వానించారు. సమావేశంలో మండల అధ్యక్షుడు సింగిర్తి మల్లేశం, మహిళా అధ్యక్షురాలు సునీత, ఎంపీటీసీ హేమంత్‌రెడ్డి, సర్పంచ్ మహేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
చోరీలు చేస్తున్న ముగ్గురు అరెస్ట్
మిర్యాలగూడ, వెలుగు : ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. డీఎస్పీ వై.వెంకటేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాల మండలం నవాపేటకు చెందిన సయ్యద్ ఆల్తాఫ్ అలియాస్ ఆఫ్తాజ్ పీడీయాక్ట్‌పై నిజామాబాద్ జైలుకు వెళ్లి ఈ ఏడాది జూన్‌లో రిలీజ్ అయ్యాడు. జైలులో ఉన్న టైంలో సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం లాల్‌సింగ్ తండాకు చెందిన ఆంగోతు నాగరాజు పరిచయం అయ్యాడు. వీరిద్దరు నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వాటర్‌ట్యాంక్ తండాకు చెందిన హమాలీ కార్మికుడు రమావత్ సురేశ్‌తో కలిసి చోరీలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఉదయం టైంలో గ్రామాల్లో తిరుగుతూ తాళం వేసిన ఇండ్లను గుర్తించి, రాత్రి తాళాలు పగులగొట్టి చోరీలు చేసేవారు. వీరిపై మిర్యాలగూడ, సూర్యాపేట, హుజూర్‌నగర్, మునగాల, చివ్వెంల పోలీస్‌స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం మిర్యాలగూడలోని రాజీవ్ చౌక్ వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా వీరు ముగ్గురు హోండా యాక్టివాపై వచ్చారు. పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించగా పట్టుకొని విచారించగా చోరీల విషయం బయటపడింది. ముగ్గురిని అదుపులోకి తీసుకొని 30 తులాల గోల్డ్, 7 కిలోల వెండి, రెండు కార్లు, ల్యాప్‌టాప్, హోండా యాక్టివాను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకున్న సీఐ రాఘవేందర్, ఎస్సైలు సుధీర్‌కుమార్, కృష్ణయ్య, నర్సింహులు, హెడ్ కానిస్టేబుల్ పి.వెంకటేశ్వర్లును డీఎస్పీ అభినందించారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం
నార్కట్‌పల్లి, వెలుగు : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలవడం ఖాయమని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా చిట్యాలలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సాగుతున్న కుటుంబ, అవినీతి పాలనను అంతం చేసేందుకు ప్రజలు రెడీగా ఉన్నారన్నారు. నల్గొండ జిల్లాపై కేసీఆర్ వివక్ష చూపుతున్నారని, బ్రాహ్మణ వెల్లంల, ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి, బునాదిగాని కాల్వలను పూర్తి చేస్తే మూడు లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాల్వలు తవ్వి ప్రాజెక్టులు వదిలేస్తే, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లు కట్టి కాల్వలను వదిలేశారని ఎద్దేవా చేశారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కడుతున్నారని ఆరోపించారు. మునుగోడులో టీఆర్‌ఎస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేసి గెలిచిందన్నారు. సమావేశంలో నల్గొండ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, నకిరేకల్ అసెంబ్లీ ఇన్‌చార్జి యాదగిరిరెడ్డి, మైళ్ల నరసింహ, నిమ్మల రాజశేఖర్‌రెడ్డి, నకిరేకంటి మొగులయ్య, మండల వెంకన్న, పట్టణ అధ్యక్షుడు కూరెళ్ల శ్రీను పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి
యాదగిరిగుట్ట, వెలుగు : ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టకు చెందిన పలువురు ఆటో డ్రైవర్లు శుక్రవారం మహేందర్‌రెడ్డిని కలిశారు. ముందస్తు సమాచారం లేకుండా యాదగిరిగుట్టపైకి ఆటోలను నిషేధించడం వల్ల 300 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు కనీసం 30 ఆటోలనైనా కొండపైకి అనుమతించేలా ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. దీంతో మహేందర్ మాట్లాడుతూ యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధితో పాటు స్థానికులకు ఉపాధి కల్పించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. కార్యక్రమంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, నాయకులు గుండ్లపల్లి భరత్‌గౌడ్, సుడుగు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలి
యాదాద్రి, వెలుగు : స్టూడెంట్స్ ప్రశ్నించేతత్వం అలవర్చుకున్నప్పుడే కొత్త విషయాలు తెలుస్తాయని యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి చెప్పారు. సైన్స్ ఫెయిర్‌లో ప్రతిభ చూపిన స్టూడెంట్స్‌కు శుక్రవారం ప్రశంసాపత్రాలు, మెమొంటోలు అందజేసి మాట్లాడారు. స్టూడెంట్స్ కొత్త విషయాలు, పరిశోధన పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, సైన్స్ ఫెయిర్ జ్యూరీ మెంబర్ డాక్టర్ కే.హరిప్రసాద్, డీఈవో నారాయణరెడ్డి, జిల్లా సైన్స్ ఆఫీసర్ భరణికుమార్ పాల్గొన్నారు. అనంతరం భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలో నిర్వహించిన మీటింగ్‌లో పాల్గొన్నారు. గర్భిణులు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వెల్ఫేర్ ఆఫీసర్ కృష్ణవేణి పాల్గొన్నారు.
హామీలను అమలుచేయాలి
రాజపేట, వెలుగు : సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు శుక్రవారం యాదాద్రి జిల్లా రాజాపేట తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రుణమాఫీ చేయాలని, ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధరతో పాటు, అదనంగా రూ. 500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ పనిముట్లు, కరెంటు మోటార్లు, డ్రిప్, ట్రాక్టర్ పరికరాలకు సంబంధించి రైతులకు సబ్సిడీని ఇవ్వాలని కోరారు. అనంతరం తహసీల్దార్ రవికుమార్‌కు వినతిపత్రం అందజేశారు. నాయకులు బాల్‌రెడ్డి, అశోక్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, శివరాములు, శేఖర్‌రెడ్డి, బాలయ్య, నరసింగరావు పాల్గొన్నారు.