- ఉమ్మడి జిల్లాలో టికెట్ల కోసం తీవ్ర పోటీ
- ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు
- అప్లై చేసుకునేందుకు క్యూ కడుతున్న నేతలు
ఆదిలాబాద్, వెలుగు : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మునుపెన్నడు లేనివిధంగా బీజేపీలో జోష్ కనిపిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి బీజేపీలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అభ్యర్థుల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అధిష్టానం అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పోటీ చేసేందుకు లీడర్లు క్యూ కడుతున్నారు.
బుధవారం ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే వామన్ రెడ్డి కోడలు, పార్టీ అధికార ప్రతినిధి చిలుకూరి జ్యోతిరెడ్డి, ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కుంరం వందన టికెట్ కోసం అప్లై చేసుకున్నారు. వీరితో పాటు ఇంకా చాలా మంది నేతలు ఆయా నియోజకవర్గాల నుంచి దరఖాస్తులు చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. సీనియర్లతో పాటు కొత్తగా పార్టీలో చేరిన నేతలు సైతం బీజేపీ టికెట్లు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గాల్లో తాము పోటీలో ఉంటామంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
ఒక్కో నియోజకవర్గంలో ముగ్గురేసి..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో సైతం టికెట్ల కోసం అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ప్రతి నియోజకవర్గం నుంచి ఇద్దరు లేదా ముగ్గురు నేతలు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్‌తో పాటు, జడ్పీ మాజీ చైర్ పర్సన్ సుహాసినీ రెడ్డి, అధికార ప్రతినిధి జ్యోతి రెడ్డి పోటీలో ఉన్నారు. బోథ్ నియోజక
వర్గం నుంచి ఎంపీ సోయం బాపూరావు సైతం ఈసారి ఎమ్మెల్యేగా బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. అటు గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాకటి దశరథ్, రిటైర్డ్ ఏఎస్పీ గోద్రు టికెట్లు ఆశిస్తున్నారు.
మంచిర్యాలలో జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రావుతో పాటు బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి తుల ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి ములకల మల్లారెడ్డి సైతం పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. చెన్నూర్ నుంచి అందుకుల శ్రీనివాస్, పత్తి శ్రీనివాస్, బెల్లంపల్లి నుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వెంకటకృష్ణ టికెట్లు ఆశిస్తున్నారు. నిర్మల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ముథోల్ నియోజకవర్గం నుంచి జిల్లా అధ్యక్షురాలు రమాదేవి
మోహన్ రావు పటేల్, రామరావు పటేల్, ఖానాపూర్ నుంచి మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, పెంబి జెడ్పీటీసీ జానుబాయి, ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి మహిళా మోర్చ అధ్యక్షురాలు కుంరం వందన, జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్నక్ విజయ్ కుమార్, నియోజకవర్గ ఇన్ చార్జ్ అజ్మీర ఆత్మారం నాయక్, సిర్పూర్ నియోజకవర్గం నుంచి ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యుడు పాల్వాయి హరీశ్ బాబు టికెట్బరిలో ఉండేందుకు రెడీ అవుతున్నారు.
బీఆర్ఎస్కు గట్టి పోటీ..
ఉమ్మడి జిల్లాలో బీజేపీ బలంగా కనిపిస్తోంది. అధికార బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చేందుకు అధిష్టానం బలమైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు సిద్ధమవుతోంది. చాలా చోట్ల బీఆర్ఎస్లో వర్గపోరుతో పార్టీ కాస్త బలహీనంగా మారడం.. ఇటు బీజేపీ బలం పుంజుకోవడంతో ఈసారి అధికార పార్టీకి గట్టి పోటీ ఎదురవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అభ్యర్థుల aనెలకొంది. 10 నియోజకవర్గాల్లో సగానికి పైగా సీట్లు పార్టీ గెలిచేలా అధిష్టానం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
అయితే, గతంలో బరిలో ఉన్న అభ్యర్థులకు ఈసారి కొత్త నేతలతో గట్టి పోటీ ఏర్పడుతోంది. తమకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ కొత్త నేతలు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ అంశంపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఎవరికి టికెట్ వచ్చినా క్యాడర్ చేజారి పోకుండా చూసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుతో అనుచరులు, కార్యకర్తలు కలవరపడుతుండగా ఇప్పుడు బీజేపీలో సైతం టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థుల సంఖ్య పెరిగిపోవడంతో వర్గపోరు తప్పేట్లు లేదు.