ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు: ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బంగారు శృతి అన్నారు. గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ అధ్యక్షతన ఖమ్మం జిల్లా పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్​ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేశారన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్​ ప్రభుత్వంలో ఉన్న మంత్రులెవరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని విమర్శించారు. కిసాన్​ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్​రెడ్డి మాట్లాడుతూ రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేయాలని ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో జిల్లా ఇన్​చార్జి కడగంచి రమేశ్, ఉదయ్​ప్రతాప్​, కార్పొరేటర్​ సత్యనారాయణ, వాసుదేవరావు, శ్యాంరాథోడ్, రుద్ర ప్రదీప్​, రవికుమార్​, విజయరాజు పాల్గొన్నారు.

ఘనంగా శ్రీనివాస రామానుజన్​ జయంతి 

ఖమ్మం టౌన్, భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గణిత మేధావి శ్రీనివాస రామానుజన్​జయంతి గురువారం ఘనంగా నిర్వహించారు. ఖమ్మం సిటీలోని ఉమెన్స్ కాలేజ్ లో మ్యాథ్స్​డిపార్ట్​మెంట్ ఆధ్వర్యంలో మాథమేటిక్స్ డే ఘనంగా జరిపారు. కొత్తగూడెంలోని కూలీలైన్​ గవర్నమెంట్​ హైస్కూల్​లో క్విజ్​ పోటీలు 
నిర్వహించారు. 

సర్వజ్ఞ స్కూల్ లో..

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం సిటీలోని వీడీవోస్​కాలనీలోని సర్వజ్ఞ స్కూల్ లో శ్రీనివాస రామానుజన్ జయంతిని నిర్వహించారు. డైరెక్టర్స్ ఆర్.నీలిమా, నాగేంద్ర కుమార్ రామానుజన్ ఫొటోకు పులమాలవేసి నివాళులర్పించారు. స్టూడెంట్స్ కు టాలెంట్ టెస్ట్, ఎక్స్ పో, క్విజ్, గణిత శాస్త్రానికి సంబంధించిన నమూనాలను ప్రదర్శించారు.  

శ్రీగాయత్రీ ఆదిత్య స్కూల్​కు అవార్డు  

శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా ఎస్ఆర్ఎఫ్​ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్​లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో  నిర్వహించిన ఒలింపియాడ్ టెస్ట్​లో రఘునాథపాలెం మండలం మంచుకొండలోని శ్రీ గాయత్రి ఆదిత్య స్కూల్ కు ఒలింపియాడ్ అవార్డ్ వచ్చినట్లు స్కూల్​కరస్పాండెంట్​ చిన్నం వెంకమరాజు తెలిపారు. 

విద్యారంగానికి బడ్జెట్​ పెంచరెందుకు?

ఖమ్మం టౌన్, వెలుగు: రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రూ. 3,500 కోట్ల ఫీజు రీయంబర్స్​మెంట్​, స్కాలర్ షిప్​లను తక్షణమే విడుదల చేయాలని ప్రముఖ విద్యావేత్త, ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్​చేశారు. ఖమ్మంలోని  సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం  పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు పి.మహేశ్​ అధ్యక్షతన బిగ్​డిబేట్​నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్​హరగోపాల్​మాట్లాడుతూ బీఆర్ఎస్​ ప్రభుత్వం విద్యారంగానికి తక్కువ బడ్జెట్ కేటాయించడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. అమెరికా, సింగపూర్, జర్మనీ లాంటి దేశాలను పొగుడుతున్న కేసీఆర్ ఆయా దేశాలలో మాదిరిగా విద్యారంగానికి అధిక నిధులు ఎందుకు కేటాయించడంలేదో తెలపాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర పాలకులు విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో హెచ్​సీయూ ప్రొఫెసర్ కె.వై.రత్నం, ప్రొఫెసర్ పాపారావు, టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్, వివిధ విద్యార్థి సంఘాల లీడర్లు ఎస్.వి.శ్రీకాంత్, పుట్ట లక్ష్మణ్, మల్లేష్, ప్రైవేటు డిగ్రీ, జూనియర్ అసోసియేషన్స్ నాయకులు బాలకృష్ణ రెడ్డి, శ్రావణ్, లీడర్లు శ్రీనివాస్, కిరణ్, రాజేశ్వర్, శ్యామ్, వినోద్, తిరుపతి, మస్తాన్ పాల్గొన్నారు.

సింగరేణి డేకు ఏర్పాట్లు పూర్తి 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి డే వేడుకలకు కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియం ముస్తాబైంది. శుక్రవారం ఈ వేడుకలను పెద్దఎత్తున నిర్వహించేందుకు సింగరేణి మేనేజ్​మెంట్​ఏర్పాట్లు చేసింది. వేడుకల్లో భాగంగా స్టేడియంలో పలు రకాల స్టాల్స్​ను ఏర్పాటు చేయనున్నట్లు జీఎం(వెల్ఫేర్)​ కె.బసవయ్య పేర్కొన్నారు. ఎక్స్​ప్లోరేషన్​, ఎన్విరాన్​మెంట్, ఫారెస్ట్రీ, కమ్యూనికేషన్​సెల్, మెడికల్, సేఫ్టీ,  సోలార్​ఎనర్జీ, ఈఅండ్ఎం, సింగరేణి సూపర్​బజార్​, ఫుడ్​కోర్టు వంటి మొత్తం 22 స్టాల్స్​ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 9.30 గంటలకు వేడుకలు స్టార్ట్​ అవుతాయని అన్నారు. సాయంత్రం వేళల్లో సినీ, టీవీ నటులతో ప్రోగ్రామ్స్​ ఉంటాయన్నారు. వేడుకలకు చీఫ్​గెస్ట్​గా సింగరేణి కంపెనీ చైర్మన్​ ఎన్​.శ్రీధర్​ హాజరు కానున్నారని పేర్కొన్నారు. 

29 నుంచి వ్యవసాయ కార్మిక సంఘ మహాసభలు

తల్లాడ వెలుగు: ఈనెల 29, 30, 31 తేదీల్లో ఖమ్మంలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. గురువారం కుర్నవల్లి గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాసభలకు రైతు, కూలీలు, ప్రజలు అధిక సంఖ్యలో ఎర్ర చొక్కాలు, చీరలు ధరించి తరలిరావాలని సూచించారు. బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనీయమని, రాష్ట్రంలో రానున్న రోజుల్లో బీజేపీ రూపంలో అతిపెద్ద ప్రమాదాన్ని అడ్డుకునేందుకు మునుగోడు ఎన్నికలలో టీఆర్ఎస్ కు సహకరించినట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు భారతి, జిల్లా కమిటీ సభ్యులు రమేశ్ రామలింగేశ్వరరావు, భాస్కరరావు పాల్గొన్నారు.