మునుగోడులో ధర్మ యుద్ధం ప్రారంభమైంది

మునుగోడులో ధర్మ యుద్ధం ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మునుగోడులో బీజేపీ గెలుపు కోసం గంగిడి మనోహర్ రెడ్డి తన సీటు త్యాగం చేశాడన్నారు. నియోజకవర్గంలో మనోహర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి తిరుగుతుంటే కేసీఆర్ గుండెలు అదురుతున్నాయని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఎన్నిక ఒక్క నియోజకవర్గానికి సంబంధించినది కాదని..రాష్ట్ర ప్రజల అభివృద్ది కోసం జరుగుతున్న ఎన్నిక అని అన్నారు. ఇప్పటికే బీజేపీకి చెందిన ఆర్ఆర్ఆర్ లు అసెంబ్లీకి వెళ్లాయని..త్వరలోనే నాలుగో ఆర్ చేరబోతుందని తెలిపారు. 

చౌటుప్పల్ మండలంలో కాలుష్యంతో ప్రజలు చస్తుంటే..కేసీఆర్ మాత్రం డబ్బు సంచులు తీసుకొని పార్థసారథి రెడ్డికి పదవి కట్టబెట్టిండని బండి సంజయ్ ఆరోపించారు. గ్రామాల అభివృద్ధి సహా రాష్ట్రంలో కేసీఆర్ పెట్టిన స్కీంలకు కేంద్రప్రభుత్వమే నిధులు ఇస్తోందన్నారు. ఇచ్చిన హామీల అమలుచేయకుండా ప్రజలను మోసం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న సీఎం..తన ఇంటికి మాత్రం నాలుగు ఉద్యోగాలు ఇచ్చాడని విమర్శించారు. 

కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో లేదు, గల్లీలో లేదన్న బండి సంజయ్..డబుల్ ఇంజన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. తనను ఈ బందీ నుంచి విముక్తి చేయమని..కేసీఆర్ గడిలో ఉన్న తెలంగాణ తల్లి శోకం పెడ్తుందని అన్నారు. తెలంగాణ వచ్చాక రైతులు వడ్ల కుప్పలపై కుప్పకూలిపోతన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.