నల్గొండ: టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టే పార్టీ బీజేపీ అని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం చండూర్ మండల కేంద్రలో నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 12 మంది ఎమ్మెల్యేలను లాక్కొని కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని బొందపెట్టారన్నారు. కానీ కేసీఆర్, టీఆర్ఎస్ ను బొంద పెట్టేందుకు బీజేపీ వచ్చిందని హెచ్చరించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక కొంతమంది పోస్టర్లు అతికించి సోషల్ మీడియలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తిగా ప్రజల కోసమే తాను పార్టీ మారినట్లు స్పష్టం చేశారు. చచ్చేంత వరకు మునుగోడు ప్రజాలతోనే ఉంటానని, వేరే ఏ నియోజకవర్గంలో పోటీ చేయనని తేల్చి చెప్పారు.
మూడేండ్లుగా ఏం చేయలేకపోయా...
కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి మూడేండ్లు ఏం చేయలేకపోయానని మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న తనకు నిధులు ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తాను బీజేపీలోకి వెళ్లానన్న ఆయన... మోడీ, అమిత్ షా నాయకత్వంలో మునుగోడును అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే మునుగోడు ఉప ఎన్నిక కేసీఆర్ ను గద్దె దించే యుద్ధమన్న రాజగోపాల్ రెడ్డి... కేసీఆర్ కుటుంబ పాలన పోవాలంటే మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.