హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల్లో టీడీపీ మద్దతు కోసం స్టేట్ బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబుతో మంతనాలు జరిపేందుకు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆ స్థానంలో కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ లాంటి నాయకులు గట్టి పోటీ ఇస్తున్నారు.
అలాగే, బీజేపీ నుంచి మల్కాజ్‌గిరిలో పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌కు కూడా కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి టఫ్ ఫైట్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ మద్దతు తీసుకునేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అలాగే, హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా సెటిలర్ల ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీ మద్దతు ఉంటే బాగుంటుందని బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగానే బుధవారం టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జ్ అరవింద్ కుమార్ గౌడ్ నివాసంలో కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి భేటీ అయినట్లు తెలుస్తోంది.