
బీజేపీ, జనసేన వెల్లడి విజన్ డాక్యుమెంట్ రిలీజ్
అమరావతి, వెలుగు: ఏపీ లోకల్ బాడీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని బీజేపీ, జనసేన పార్టీలు నిర్ణయించాయి. పొత్తులో భాగంగా ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ప్రకటించారు. గురువారం రెండు పార్టీల నేతలు విజయవాడలో సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికలకు విజన్ డాక్యుమెంట్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న రౌడీ రాజకీయాలకు ముకుతాడు వేయాల్సిన టైం వచ్చిందన్నారు. స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేస్తున్న ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులపై వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగుతున్నారని మండిపడ్డారు. బెదిరింపులకు దిగినా తట్టుకుని పోటీలో నిలబడాలని నేతలు, కార్యకర్తలకు పవన్ సూచించారు. యువతకు అవకాశం కల్పించాలనే ఉమ్మడిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్ వేయకుండా అడ్డుకున్న ఘటనల వీడియోలు, ఆధారాలను ఎస్ఈసీ, డీజీపీకి అందిస్తామన్నారు. ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మినారాయణ మాట్లాడుతూ..పోలీసులు అధికార పార్టీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఉపయోగం లేదన్నారు. స్థానిక ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోవాలనే వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. రాయలసీమ జిల్లాల్లో బీజేపీ కార్యకర్తలను వైసీపీ శ్రేణులు దారుణంగా కొట్టారన్నారు.