
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సర్వం కోల్పోయిన బాధితులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ లో ఆయన పర్యటించారు.
అనంతరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కనీసం వరద బాధితులను పరామర్శించడానికి కూడా వెళ్లలేదని అన్నారు. విద్యా, వైద్యం.. అన్ని రంగాల్లో రాష్ట్రం వెనకబడిందని ఆరోపించారు. సొంతలాభం కోసంమే కొండపోచమ్మ జలాశయాన్ని నిర్మించారని అన్నారు.
గజ్వేల్ లో సీఎం కేసీఆర్ కు డిపాజిట్ దక్కకుండా ఓడిస్తామని అన్నారు.కేంద్రానికి రైతు బాధితుల వివరాలు ఇవ్వలేని దుస్థితిలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నారని అన్నారు. తెలంగాణలో దోచుకున్న సొమ్మంతా కేసీఆర్ మహారాష్ట్ర లో రాజకీయాలంటూ ఖర్చు చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు.
డబుల్ బెడ్రూం ఇళ్లు, రైతులకు రూ.లక్ష రుణమాఫీ అంటూ ప్రజలను నమ్మించి బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశప్రజల కోసం ప్రధాని మోదీ తపిస్తే.. తన కుటుంబ బాగు కోసం కేసీఆర్ పరితపిస్తున్నారని ఎద్దేవా చేశారు.