టీఆర్ఎస్ పార్టీ నేతలు డబ్బు సంచులతో మునుగోడు నియోజకవర్గంలోకి అడుగుపెడుతున్నారని.. ఇక్కడి ప్రజలు అమ్ముడుపోరని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. అవినీతి సొమ్ముతో కొనే ప్రయత్నం చేస్తారని.. ప్రజలు ధర్మం వైపు ఉండాలని సూచించారు. డబ్బు సంచులు, పెన్షన్లు, గొర్రెలు.. ఇలా ఎన్ని ప్రలోభాలు చేసినా మునుగోడు ప్రజలు అమ్ముడుపోరన్నారు. గట్టుప్పల్ లో కార్యకర్తలతో రాజగోపాల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఓటు వేసుకొనేది మీ కోసమేనని.. ప్రజాస్వామ్యంలో యుద్ధం జరుగబోతోందన్నారు. మునుగోడులో జరిగే ఉప ఎన్నికలో ప్రజలే గెలుస్తారని స్పష్టం చేశారు.
కుటుంబపాలన, అవినీతి పాలనను పారదోలేందుకు.. టీఆర్ఎస్ పార్టీ సర్కారుకు చరమగీతం పాడేందుకు.. మోడీ, షా నాయకత్వంలో బీజేపీలో చేరినట్లు రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తనపై విమర్శలు చేస్తున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ కు చరిత్ర లేదని.. రాజకీయాల్లోకి రాకముందు దొంగతనాలు చేసేవాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాబు డైరెక్షన్ లో ఆయన పని చేస్తున్నారని విమర్శించారు. డబ్బు కోసం అమ్ముడు పోయింది ఎవరో ప్రజలకు తెలుసని, ఏ కేసులో రేవంత్ జైలుకు పోయారో గుర్తుంచుకోవాలన్నారు. ఎవరెవరు ఎన్నెన్ని ఆస్తులు సంపాదించారో చర్చిద్దామా అని సవాల్ విసిరారు.