తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు.. సీఎం అభ్యర్థిగా పళనిస్వామి

తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు.. సీఎం అభ్యర్థిగా పళనిస్వామి

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో అన్నాడీఎంకే-బీజేపీ పొత్తు ఖరారైంది. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేస్తామని పళనిస్వామితో భేటీ అనంతరం అమిత్ షా ప్రకటించారు.

అంతేకాదు.. తమిళనాడులో ఎన్డీయే కూటమి నుంచి సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును కూడా అమిత్ షా ప్రకటించేశారు. ఎలాంటి షరతులు లేకుండానే అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు ఖరారు చేసుకున్నామని అమిత్ షా స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో ఒక పక్క పళనిస్వామిని, మరో పక్క అన్నామలైని కూర్చోబెట్టుకుని మరీ ఎన్డీయేతో అన్నాడీఎంకే పొత్తును అమిత్ షా ప్రకటించడం గమనార్హం.

2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ పొత్తు వల్ల బీజేపీ తమిళనాడులో నాలుగు అసెంబ్లీ నియోజవర్గాలను కైవసం చేసుకుంది. 2023లో బీజేపీతో పొత్తును అన్నాడీఎంకే తెగతెంపులు చేసుకుంది. మళ్లీ.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ, అన్నాడీఎంకే కలిసి ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించుకున్నాయి.

2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. మాజీ ఐపీఎస్ ఆఫీసర్, బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై.. మీ కొడుకును, మీ తమ్ముడిని (వీటు పిళ్లై.. ఉంగల్ తంబి) అంటూ చేసిన ప్రచారం ఓట్లను పెంచిందే తప్ప సీట్లను తీసుకురాలేకపోయింది. రాష్ట్రంలో 3 నుంచి 5 సీట్లలో బీజేపీ గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి.

కోయంబత్తూరు నుంచి బరిలో దిగిన అన్నామలైపై డీఎంకే అభ్యర్థి గణపతి రాజ్​కుమార్ విజయం సాధించారు. తెలంగాణ గవర్నర్గా పనిచేసిన తమిళిసై, ప్రముఖ నటి రాధిక తదితర ఎన్డీఏ అభ్యర్థులంతా ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో 6% ఓట్​షేర్ 2024లో 11 శాతానికి పెరగడం బీజేపీకి కాస్త ఓదార్పునిచ్చింది.

2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు అనివార్యమని భావించిన బీజేపీ అధిష్టానం.. పొత్తు ప్రకటించి ఎన్నికల బాధ్యతలను పళనిస్వామి చేతుల్లో పెట్టింది. బీజేపీతో కలిసి పని చేసేందుకు అంగీకరించిన పళనిస్వామి తమిళనాడులో అన్నామలైని పదవి నుంచి తొలగించాలని కోరిన కోరికను కూడా బీజేపీ అధిష్టానం నెరవేర్చింది.

తమిళనాడు బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి అన్నామలై తప్పుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోటీకి అవకాశాలు కనిపిస్తున్నాయి. సినీ నటుడు విజయ్ కూడా ఎన్నికల బరిలో నిలవనుండటంతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారబోతున్నాయి.