- కేసీఆర్ పాలనలో మొత్తం అవినీతే: జేపీ నడ్డా
- బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస్ సమితి
- టీఆర్ఎస్ పేరు మార్చినంత మాత్రాన తీరు మారుతదా?
- రాష్ట్రాన్ని వెనక్కి నెట్టి.. కేసీఆర్ కుటుంబమే బాగుపడ్డది
- తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నం..
- వేల కోట్లతో ప్రాజెక్టులు చేపడుతున్నం
- బీఆర్‌ఎస్ లీడర్లు కండ్లుండి వాటిని చూడలేకపోతున్నరు
- అంధకారం నిండిన రాష్ట్రంలో కమలం వికసిస్తది
- అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తం
- నాగర్ కర్నూల్ బహిరంగ సభలో బీజేపీ చీఫ్ ప్రకటన
నాగర్‌కర్నూల్/మహబూబ్‌నగర్, వెలుగు: అమరుల బలిదానాలు, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను బర్బాద్ చేశారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో మొత్తం అవినీతేనని అన్నారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చినంత మాత్రాన పార్టీ తీరు మారుతుందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస్ సమితి అని విమర్శించారు. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడాలంటే బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయాలని, అభివృద్ధి కావాలనుకుంటే బీజేపీకి ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభకు నడ్డా చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. రాష్ర్టాన్ని వెనక్కి నెట్టి.. కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్, బిడ్డ కవిత, వాళ్ల కుటుంబ సభ్యులు బాగుపడుతున్నారని ఆరోపించారు.
దేశాన్ని అభివృద్ధి చేసినట్లే తెలంగాణ అభివృద్ధికి కూడా ప్రధాని మోదీ, బీజేపీ కట్టుబడి ఉన్నట్లు నడ్డా చెప్పారు. తెలంగాణలో ఇటీవల రూ.11 వేల కోట్ల ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారని, కానీ బీఆర్ఎస్ లీడర్లు కండ్లుండి కూడా వాటిని చూడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
‘‘సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను రూ.740 కోట్లతో డెవలప్ చేశాం. రాష్ట్రంలో రైల్వేస్, హైవేలు, ఎంఎంటీఎస్‌ను అభివృద్ధి చేసింది కేంద్ర ప్రభుత్వమే. ఉమ్మడి ఏపీలో నాటి కేంద్ర ప్రభుత్వం ఇక్కడి రైల్వే ప్రాజెక్టులకు రూ.880 కోట్లు కేటాయిస్తే.. మోదీ ఒక్క తెలంగాణకే రూ.4,410 కోట్లు ఇచ్చారు” అని చెప్పారు. తెలంగాణకు ఇప్పటికే రెండు వందేభారత్ రైళ్లు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో 2014కు ముందు 2,500 కిలోమీటర్ల నేషనల్ హైవేలు ఉంటే తాము అధికారంలోకి వచ్చాక అదనంగా మరో 2,500 కిలోమీటర్ల నేషనల్ హైవే రోడ్లు వేయించామని చెప్పారు. హైదరాబాద్, నల్గొండ, వరంగల్ ప్రాంతాలకు ఇండస్ర్టియల్ కారిడార్లు మంజూరు చేశామని వివరించారు. దేశంలో ఏడు మెగా టెక్ప్ టైల్స్ పార్కులను మంజూరు చేస్తే, చేనేత కార్మికుల అభివృద్ధి కోసం తెలంగాణకు కూడా ఒకటి ఇచ్చామని చెప్పారు. వరంగల్ రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు వచ్చింది మోదీ వల్లేనని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్న బీజేపీకి రాష్ట్రంలోనూ ఒక్క అవకాశం ఇవ్వాలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కోరారు.
వెలుగులు నింపుతున్నం
మోదీ ప్రభుత్వం దేశంలోని బడుగు, బలహీన వర్గాలు, రైతులు, యువకులు, పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని నడ్డా చెప్పారు. 80 కోట్ల మందికి 5 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నామని, ఇది యూరప్ మొత్తం జనాభాకు సమానమని అన్నారు. మోదీ ప్రధాని కాక ముందు దేశంలో 22 శాతం పేదరికం ఉంటే, బీజేపీ వచ్చాక 10 శాతానికి తగ్గిపోయిందని చెప్పారు. దేశంలో నాలుగు కోట్ల మందికి పక్కా ఇండ్లు కట్టిస్తే, ఒక్క తెలంగాణలోనే 2.50 లక్షలు ఇండ్లు కట్టించామని, కానీ కేసీఆర్ ఆ ఇండ్లకు ‘డబుల్ బెడ్రూమ్ స్కీం’ అని పేరు మార్చి, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇలాంటి వాళ్లను జైలుకు పంపాలన్నారు. దేశంలో 11 కోట్ల టాయిలెట్స్ కట్టించగా.. అందులో 21 లక్షల టాయిలెట్లను తెలంగాణలో కట్టామన్నారు.
ఉజ్వల గ్యాస్ ప్రవేశపెట్టి 9 కోట్ల మందికి స్కీమ్‌ను వర్తింపజేశామని, ఆయుష్మాన్ భారత్ ద్వారా 50 కోట్ల మందికి రూ.5 లక్షల బీమా చేయించామని నడ్డా చెప్పారు. రైతులకు పెట్టుబడి కింద ‘కిసాన్ సమ్మాన్ నిధి’ స్కీం ద్వారా ఏడాదికి రూ.6 వేలు చొప్పున మూడు విడతల్లో పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ స్కీం ద్వారా దేశంలో 11.78 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుండగా, తెలంగాణలో 48 లక్షల మందికి సాయం అందుతోందని చెప్పారు. అంధకారంలో ఉన్న తెలంగాణలో కమలం వికసిస్తుందని నడ్డా జోస్యం చెప్పారు. సభలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మహేంద్రనాథ్ పాండే, ఎంపీ కె.లక్ష్మణ్, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, నేతలు శాంత కుమార్, కొల్లే మాధవి, దిలీపాచారి తదితరులు పాల్గొన్నారు.
ఏం ఉద్ధరించారని ఉత్సవాలు?: డీకే అరుణ
నాగర్‌కర్నూల్, వెలుగు: తెలంగాణను ఏం ఉద్ధరించారని దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. తిమ్మిని బమ్మిని చేసి చెప్పడంలో తండ్రీ కొడుకులు చాంపియన్లని విమర్శించారు. పాలమూరు జిల్లాలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. కుర్చీ వేసుకొని కూర్చొని పాలమూరు– రంగారెడ్డి కంప్లీట్ చేసి 12 లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఇస్తానన్న మాట ఏమైందని నిలదీశారు. ఈ ప్రాజెక్ట్ మీద కేసుల వేసిన ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకున్న కేసీఆర్‌ను ఇక్కడి ప్రజలు క్షమించరన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందని అరుణ ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికులు హక్కుల కోసం పోరాడే పరిస్థితి లేదని, అందరినీ ఉక్కుపాదంతో అణచివేస్తున్నారన్నారు. యూరియా, డీఏపీ మీద కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.25 వేల కోట్ల రాయితీ ఇస్తున్నదని చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసే పోటీ చేస్తాయని, ఈ డ్రామా అంతా ఎన్నికల వరకేనని అరుణ చెప్పారు.
మోదీ గ్లోబల్ లీడర్
కరోనా, ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో చాలా దేశాలు ఆర్థికంగా దివాళా తీశాయని, కానీ మోదీ ముందుచూపుతో ఇండియా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారని నడ్డా చెప్పారు. బీజేపీ అధికారంలోకి రాకముందు ఆర్థికంగా పదో స్థానంలో ఉన్న భారత్‌ను ఐదో స్థానంలోకి తీసుకొచ్చారని చెప్పారు. 2014కు ముందు ఇండియాకు 92% ఫోన్లు చైనా, ఇతర దేశాల నుంచి వచ్చేవని, బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం 97 శాతం ఫోన్లను మన దేశంలోనే తయారు చేస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో భారత్ మూడో స్థానంలో, బొగ్గు ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు.
అమెరికాకు మోదీ వెళ్తే అక్కడి ప్రజలు, ఆఫీసర్లు ‘మోడీ ఈజ్ బాస్, హి ఈజ్ గ్లోబల్ లీడర్, హి ఈజ్ హీరో ’ అని కొనియాడుతున్నారని, కానీ ఇక్కడి కాంగ్రెస్ లీడర్లు మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ‘మోదీని కులం పేరుతో తిడుతున్నారు. నీచుడు, దొంగ అంటూ నిందిస్తున్నారు. కానీ మోదీ వీళ్ల తిట్లను విషాన్ని మింగినట్లు మింగుతున్నారు’’ అని నడ్డా కొనియాడారు. ప్రసంగానికి ముందు జేపీ నడ్డా జోగుళాంబ అమ్మావారు, ఉమామహేశ్వరుడు, పవిత్రి కృష్ణానది, తెలంగాణ అమరవీరులను స్మరించుకున్నారు.
మన ప్రత్యర్థి బీఆర్ఎస్సే
రాష్ట్రంలో గెలవడమే టార్గెట్: నడ్డా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్సే అని ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా చెప్పారు. ఆదివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన.. నోవాటెల్‌లో పార్టీ రాష్ట్ర నేతలతో భేటీ అయ్యారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, విజయశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఎన్నికలకు సంబంధించి నడ్డా దిశానిర్దేశం చేశారు. ‘‘బీఆర్ఎస్ను ఓడించడమే మన లక్ష్యం. దీనిపై హైకమాండ్ సీరియస్‌గా పని చేస్తున్నది. తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది” అని చెప్పారు. ‘‘రాష్ట్రంలో గెలుపే లక్ష్యంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, నేను ఇక్కడికి వస్తున్నాం. కర్నాటక ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపవు” అని అన్నారు. కాగా, అంతకుముందు వివేక్ వెంకటస్వామి, రఘునందన్ రావు, విజయశాంతితో నడ్డా విడివిడిగా భేటీ అయ్యారు.
అది ఫొటో సెషన్ మాత్రమే
మోదీని వ్యతిరేకించే పార్టీలన్నీ నాలుగు రోజుల కిందట బీహార్‌లో కలిశాయని, కానీ అది ఒక ఫొటో సెషన్ మాత్రమేనని నడ్డా ఎద్దేవా చేశారు. ‘‘అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు, కుల పార్టీలు మోదీని ఎదిరించడానికి ఏకమయ్యాయి. మీకు కుల పార్టీలు కావాలంటే బీహార్‌లో ఆర్జేడీని గెలిపించండి.. వంశపారంపర్య పార్టీ కావాలంటే ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీకి ఓటేయండి. కుటుంబ పార్టీ కావాలంటే తెలంగాణలో బీఆర్ఎస్‌కు ఓటేయండి. కానీ అభివృద్ధి కావాలంటే బీజేపీకి మాత్రమే ఓటేయండి’’ అని ప్రజలను కోరారు.
రాష్ట్రంలోని పేదలను ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి, సీఎం కేసీఆర్కుటుంబమే ముందుకు పోతున్నది. ‘ధరణి’ పోర్టల్ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నది. ఆ పోర్టల్ ద్వారా ఆయన కుటుంబం, ఆ పార్టీ లీడర్లు, కార్యకర్తలు జేబులు నింపుకుంటున్నరు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తం.