కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : కొండపల్లి శ్రీధర్ రెడ్డి

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : కొండపల్లి శ్రీధర్ రెడ్డి
  • రైతులు పట్ల నిర్లక్ష్యం వీడాలి
  • బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి 

ఎర్రుపాలెం, వెలుగు : అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతుల పట్ల  ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని, వ్యవసాయ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఎర్రుపాలెం మండలంలో ఆయన పర్యటించి బాధిత రైతులను పరామర్శించారు. పంట నష్టపోయి వారం రోజులు గడుస్తున్నా ఏ ఒక్క వ్యవసాయ అధికారి కనీసం పంట నష్టం వివరాలు సేకరించేందుకు రావడం లేదని  రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 

దీంతో శ్రీధర్ రెడ్డి జిల్లా వ్యవసాయ అధికారితో ఫోన్​లో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి పంటల బీమా అమలు కాకపోవడంతో రైతులను ఆదుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. నష్టపోయిన రైతులకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో బీజేపీ నేత తాండ్ర వినోదరావు, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు చావా కిరణ్, మధిర అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరరావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వేణుగోపాలరెడ్డి, ఎర్రుపాలెం మండల అధ్యక్షుడు నూతక్క నరసింహారావు, జిల్లా కార్యదర్శి చిలువేరు సాంబశివరావు నాయకులు, రైతులు పాల్గొన్నారు. 

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

మధిర, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ నేతలు కొండపల్లి శ్రీధర్​రెడ్డి,  తాండ్ర వినోద రావు అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని రామాలయం కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్​ చేశారు. రైతుల కోసం మిర్చి బోర్డు, పామాయిల్ బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వెంటనే పంటల బీమా పథకం అమలుచేయాలని డిమాండ్​ చేశారు.