‘గృహలక్ష్మి’ సీరియల్ స్టార్ట్​ చేసిన్రు : కొండపల్లి శ్రీధర్​రెడ్డి

  •     బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి

ఖమ్మం రూరల్, వెలుగు : కల్వకుంట్ల ప్రొడక్షన్ పేరుతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సినిమా పూర్తికాకపోవడంతో, సీఎం కేసీఆర్ ​గృహలక్ష్మి పథకం పేరుతో కొత్తగా ఓ సీరియల్ స్టార్ట్​ చేశారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్​రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన తిరుమలాయపాలెం మండల రఘునాథపాలెంలో అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. అర్హులైన పేదలలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని నమ్మబలికి తొమ్మిదేళ్లుగా మోసం చేస్తున్నారన్నారు. గృహలక్ష్మి పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని ఎద్దేవా చేశారు. 

ఎన్నికలు సమీపిస్తుండడంతో మరోసారి మోసం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి పేదలకు అందకుండా చేశారని ఆరోపించారు. మూడు రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని హడావిడి చేయడం దారుణం అన్నారు. ఇంత తక్కువ వ్యవధిలో ఎలా దరఖాస్తు చేసుకోవాలని ప్రశ్నించారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తక్కెళ్లపల్లి నరేంద్రరావు, జిల్లా ఉపాధ్యక్షుడు గుండా శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్షుడు బొడ్డుపల్లి ప్రసాద్, భద్రం రవి చందర్ నాయక్ తదితరులు ఉన్నారు.