
నల్గొండ అర్బన్, వెలుగు : యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. గురువారం నల్గొండలో ఆర్జాలబావి, తిప్పర్తిలో పీఏసీఎస్ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో జిల్లా మంత్రులు, సివిల్ సప్లయ్ అధికారుల తీరుపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. తరుగు, తేమ శాతం పేరుతో రైతుల నుంచి రెండు కేజీల ధాన్యం కట్చేస్తున్నారని విమర్శించారు.
ఆరుగాలం కష్టపడి ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి కొనుగోలు కేంద్రాల్లో సమస్యలను పరిష్కరించాలని కోరారు. వారి వెంట బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, పాపయ్యగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు యాదగిరిచారి, పట్టణ అధ్యక్షుడు మిర్యాల వెంకన్న, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకట్ రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.