రెండు, మూడు, చివరి రౌండ్లలో బీజేపీకి ఆధిక్యం

నల్గొండ, వెలుగు: మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో తొలిరౌండ్లు ఉత్కంఠ  రేపాయి. పోస్టల్​ బ్యాలెట్​ ఓట్లతో పాటు మొదటి రౌండ్​లో  టీఆర్ఎస్​పైచేయి సాధించగా..  మూడు, నాలుగు రౌండ్లలో బీజేపీ ఆధిక్యత చూపింది. ఈ రెండు రౌండ్ల తర్వాత ఒక్కసారిగా టీఆర్ఎస్​శిబిరంలో కలవరం మొదలుకాగా.. బీజేపీలో జోష్​ కనిపించింది. కానీ, ఆ తర్వాత 4వ రౌండ్​ నుంచి 14వ రౌండ్​ దాకా టీఆర్ఎస్​ లీడ్​ కొనసాగింది. చివరి 15 రౌండ్​లో మాత్రం బీజేపీకి 88 ఓట్ల మెజారిటీ వచ్చినా అప్పటికే టీఆర్ఎస్ ​గెలుపు ఖాయమైంది. 

నాలుగో రౌండ్​ నుంచి వరుసగా..

ఆదివారం ఉదయం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఫలితాల్లో అధికార పార్టీ పైచేయి సాధించింది. టీఆర్ఎస్​కు 405 ఓట్లు పోలవగా.. బీజేపీకు 211 ఓట్లు, కాంగ్రెస్​కు 41 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీపై- టీఆర్ఎస్​ 195 ఓట్ల లీడ్​ సాధించినట్లయింది.  తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలైంది. మొదటి రౌండ్​లో కూసుకుంట్ల 6,418 ఓట్లు సాధించగా.. రాజగోపాల్ రెడ్డికి   5,126 ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్​కు 1,292 ఓట్ల లీడ్​ రాగా, టీఆర్ఎస్​ శిబిరంలో సంబురాలు నెలకొన్నాయి. రెండో రౌండ్​ ఫలితాల్లో కూసుకుంట్లకు 7,781 ఓట్లు, రాజగోపాల్ రెడ్డి కి-  8,622 ఓట్లు,  మూడో రౌండ్​లో కూసుకుంట్లకు 7,390 ఓట్లు, రాజగోపాల్ రెడ్డికి 7426 ఓట్లు వచ్చాయి. వరుసగా రెండు రౌండ్లలో బీజేపీకి లీడ్​ రావడంతో టీఆర్ఎస్​ శిబిరంలో కాస్త కలవరం మొదలుకాగా.. బీజేపీ శిబిరంలో ఆశలు చిగురించాయి.  కానీ ఆ తర్వాత నాలుగో రౌండ్​ నుంచి 14వ రౌండ్​వరకు అన్ని రౌండ్లలోనూ టీఆర్ఎస్​ అభ్యర్థి లీడ్​కొనసాగించడంతో కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి విజయం ఖాయమైంది. నిజానికి  చౌటుప్పల్​, చండూరు మున్సిపాలిటీల్లో బీజేపీకి భారీ  మెజార్టీ వస్తుందని ఆ పార్టీ లీడర్లు ఆశించారు. ఈ రెండు మున్సిపాలిటీలు, మండలాల్లో బీజేపీకి మంచి ఆదరణ ఉందని, ఓట్లు కూడా పడ్డాయని  సర్వేలు, ఎగ్జిట్​పోల్స్​ అంచనా వేశాయి.  కానీ మున్సిపాలిటీలతోపాటు గ్రామాల్లోనూ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ సాగింది. చౌటుప్పల్​ కౌంటింగ్​ టైంలో రెండు రౌండ్లలో  బీజేపీకి లీడ్​ వచ్చినా తర్వాత కొనసాగించ లేకపోయింది. చివర్లో 15 రౌండ్​లో బీజేపీకి 88 ఓట్ల మెజారిటీ వచ్చినా అప్పటికే టీఆర్ఎస్​ గెలుపు  ఖరారైంది.  10,309 ఓట్ల మెజార్టీతో (పోస్టల్​ బ్యాలెట్​ ఓట్లతో కలిపి) టీఆర్ఎస్​ విజయం సాధించింది.