చత్తీస్ గఢ్​ వలస కూలీలకు రక్షణ కల్పించండి

చత్తీస్ గఢ్​ వలస కూలీలకు రక్షణ కల్పించండి
  • గిరిజన బాలికపై లైంగిక దాడికి యత్నించిన బీజేపీ నేతను శిక్షించాలి 
  • తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన బీజాపూర్ ఎమ్మెల్యే విక్రమ్ మాండవి 

వెంకటాపురం, వెలుగు: చత్తీస్ గఢ్​ వలస కూలీలకు రక్షణ కల్పించాలని బీజాపూర్ ఎమ్మెల్యే విక్రమ్ మాండవి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఆయన పర్యటించారు. మండల పరిధిలోని బెస్తగూడెంలో తమ రాష్ట్రం నుంచి వ్యవసాయ పనులకు వచ్చిన వలస కూలీలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామానికి చెందిన ఒక రైతు వద్ద పని చేసే వలస కూలీల కుటుంబంలోని గిరిజన బాలికపై బీజేపీ నేత లైంగికదాడికి యత్నించాడని బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 

ఈ విషయాన్ని తెలుసుకున్న ఆయన బాధితురాలిని, కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం స్థానిక పోలీసులతో మాట్లాడి కేసు వివరాలు తెలుసున్నారు.  న్యాయం జరిగే విధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరతానని ఆయన బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. బీజాపూర్ ఎమ్మెల్యేతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు బసంతారావు తొటి, నీనావుద్దే, సునీల్ ఉద్దీ, కాకా భాస్కర్, శంకర్, వెంకటాపురం పీఎసీఎస్ అధ్యక్షుడు తదితరులు ఉన్నారు.