ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నేత, మాజీ మంత్రి బాబూమోహన్ సంచలన ప్రకటన చేశారు. రాజకీయాలకే దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారాయన. ఈ ఎన్నికల్లో పోటీ చేయను.. ప్రచారం కూడా చేయను అని స్వయంగా ప్రకటించారు. అక్టోబర్ 28వ తేదీ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ పార్టీలో ఐదేళ్లుగా పని చేస్తున్నానని.. నిన్నటికి నిన్న నియోజకవర్గం మీటింగ్ కూడా నేనే పెట్టానని.. అలాంటి నాకు ఫస్ట్ లిస్టులో నా పేరు ఎందుకు లేదని ప్రశ్నించారాయన. ఫస్ట్ లిస్టులో పేరు లేకపోవటం తలవంపులుగా ఉందన్నారు. టికెట్ ఎందుకు ఇవ్వటం లేదనే విషయాన్ని కూడా చెప్పకపోవటం ఆవేదనకు గురి చేసిందన్నారు. నా గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. నాకు, నా కొడుకు మధ్య చిచ్చు పెడుతున్నారని.. ఉన్నదే ఒక్క కొడుకు అని.. మా మధ్య ఎందుకు చిచ్చు పెడతారంటూ ఆవేదన వ్యక్తం చేశారాయన.
ఉరి తీసేవాడికి కూడా చివరి సారిగా అవకాశం ఇస్తారని.. అలా కాకుండా కనీసం సమాచారం ఇవ్వకుండా.. కనీసం ఫోన్లు కూడా ఎత్తటం లేదని.. పార్టీలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎందుకు ఉండాలని ప్రశ్నించారాయన. బీజేపీ పార్టీ పెద్దలతో మాట్లాడి.. వాళ్ల వైఖరిని ఆధారంగా బీజేపీలో ఉండాలా లేదా అనేది నిర్ణయించుకుంటానని స్పష్టం చేశారాయన.