- హోరాహోరీ పోరులో కాంగ్రెస్అభ్యర్థి జీవన్‌రెడ్డి ఓటమి
- బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి డిపాజిట్ గల్లంతు
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ తరపున పోటీ చేసిన అర్వింద్ ధర్మపురి 1,09,241 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి తాటిపర్తి జీవన్‌రెడ్డిపై విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి బరిలో దిగిన బాజిరెడ్డి గోవర్ధన్ డిపాజిట్ కోల్పోయారు. రెండు రౌండ్ల పోస్టల్ బ్యాలెట్ కలిపి 15 రౌండ్లలో జరిగిన ఈవీఎం ఓట్ల లెక్కింపులో బీజేపీకి చెందిన అర్వింద్ 5,92,318 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డికి 4,83,077 ఓట్లు దక్కగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన బాజిరెడ్డి గోవర్ధన్ 1,02,406 ఓట్లతో ఘోర పరాజయం చెందారు.
కౌంటింగ్‌లో 4, 5, 14 రౌండ్లలో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థికి లీడ్రాగా మిగితా ప్రతి రౌండ్లో బీజేపీ ఆధిక్యత చాటింది. జీవన్‌రెడ్డి సొంత అసెంబ్లీ సెగ్మెంట్‌తో పాటు బోధన్, నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్‌కు మెజారిటీ లభించినా మిగిలిన బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ స్థానాలలో కాషాయం రెపరెపలాడింది. కారు పార్టీ అభ్యర్థి బాజిరెడ్డికి ఏ రౌండ్లో కూడా గౌరవప్రదమైన ఓట్లు లభించలేదు.
మూడు రౌండ్ల లెక్కింపు తర్వాత ఆశలు వదులుకున్న బీఆర్ఎస్ ఏజెంట్లు సీఎంసీ కాలేజీలోని కౌంటింగ్ హాల్ నుంచి వెళ్లిపోయారు. అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కౌంటింగ్ వైపునకు అసలు రాలేదు. 12 రౌండ్ల తరువాత ఓటమి నిర్థారణ కావడంతో కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్‌రెడ్డి కూడా వెళ్లిపోయారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వచ్చిన బీజేపీ అభ్యర్థి అర్వింద్‌ను కౌంటింగ్ పరిశీలించారు.
పోస్టల్ కౌంటింగ్ ఫస్ట్
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి చేసిన రిటర్నింగ్ ఆఫీసర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తరువాత ఈవీఎం లెక్కింపు షురూ చేయించారు. 15 రౌండ్ల ఈవీఎం కౌంటింగ్ ముగించాక చివర్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కలిపి రిజల్టు అనౌన్స్ చేశారు. నిజామాబాద్ రూరల్, కోరుట్ల, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో ఆధిక్యం లభించింది.
కాంగ్రెస్‌కు నిజామాబాద్ అర్బన్, బోధన్, జగిత్యాలలో స్వల్ప మెజారిటీ దక్కింది. బీజేపీ గెలుపును ఆపలేకపోయారు. బీఆర్ఎస్కు డిపాజిట్ దక్కకపోవడంతో అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నారాజ్ అయ్యారు. పోలైన మొత్తం ఓట్లలో చెల్లనవి తీసేస్తే ఆరో వంతు ఓట్లు పొందిన అభ్యర్థికి డిపాజిట్ లభిస్తుంది. అంటే కనీసం 2.05 లక్షల ఓట్లు రావాలి. బీఆర్ఎస్కు కేవలం 1,02,406 ఓట్లు మాత్రమే లభించాయి.