ఛత్తీస్ గఢ్ లో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. ఎన్నికలకు మూడు రోజుల ముందు ఈ ఘటన చోటుచేసుకోవండతో స్థానిక బీజేపీ నాయకులను ఆందోళనకు గురిచేస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయన్ పూర్ జిల్లా బీజేపీ ఉపాధ్యాక్షుడు రతన్ దూబే.. జిల్లాలోని కౌశాల్నర్ గ్రామంలో పార్టీ తరపున శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ క్రమంలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు దూబేపై పదునైన ఆయుధాలతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రతన్ దూబేను మావోయిస్టులే హత్య చేసుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన బీజేపీ నేత ఓం మాథుర్.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దూబే హత్య కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటనను పార్టీ ఖండిస్తుందన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని అధికారులను కోరారు.
కాగా, గత నెల 20న కూడా బీజేపీ కార్యకర్త బిర్జు తరమ్ ను మావోయిస్టులు హతమర్చారు. ఈ ఘటన మరవక ముందే మరో బీజేపీ నేత హత్యకు గురికావడంతో బీజేపీ నాయకులు భయాందోళన చెందుతున్నారు.
ALSO READ :- సీఎం కేసీఆర్ రెండో విడుత షెడ్యూల్ .. 16 రోజుల్లో 54 సభలు