
- ఫెడరల్ ఫ్రంట్ అతుకుల బొంత
- సీఎం కేసీఆర్ పై దత్తాత్రేయ ఫైర్
ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.30,000 కోట్లు గ్రాంట్లు గా ఇచ్చామని చెప్పారు. రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై ఏ చౌరస్తాలో అయినా సరే లెక్కలతో సహా చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. కేసీఆర్ ను ప్రధాని అభ్యర్థిగా ఎవ్వరూ గుర్తించరని స్పష్టం చేశారు. కేసీఆర్ తనకు పీఎం పదవిపై ఆసక్తి లేదంటున్నారని, కానీ మంత్రులు, భజనపరులు మాత్రం కేసీఆరే ప్రధాని అంటున్నారని, ఇది ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు.
కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ అతుకుల బొంత అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రోజురోజుకూ బీజేపీ గ్రాఫ్ పెరుగుతోం దని, టీఆర్‌ఎస్ గ్రాఫ్ పడిపోతుందని అన్నారు. పాకిస్తాన్ ను ఏకాకిని చేసింది ఒక్క మోడీ ప్రభుత్వమేనన్నారు. రామమందిర నిర్మాణానికి టీఆర్‌ఎస్ అనుకూలమా,వ్యతిరేకమా కేసీఆర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 300 సీట్లుగెలిస్తే కేసీఆర్, కేటీఆర్ రాజకీయ సన్యాసం చేస్తారా? అని సవాల్ విసిరారు. కేసీఆర్ కుటుంబంలోని ఆ నలుగురు చెప్పినట్లే పాలననడుస్తుందని ఆరోపించారు.