కాంగ్రెస్, బీఆర్ఎస్ డైవర్షన్​ పాలిటిక్స్: బండి సంజయ్

  • ఒకరికొకరు తిట్టుకుంటూ ప్రజల దృష్టిని మళ్లిస్తుండ్రు

  • మేమే పరేడ్ గ్రౌండ్ వేదికగా ఏర్పాట్లు చేస్తం

  • ఎవరేందో అక్కడే తేల్చుకోండి

  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్

కరీంనగర్: మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ లీడర్ బాల్క సుమన్‌పై  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్​మండిపడ్డారు. భాష పట్ల నేతలు హద్దుల్లో ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ నాయకులు హద్దు మీరుతున్నారని, సీఎంను చెప్పుతో కొడతా అనడం తప్పని, ఇంతకంటే సిగ్గు చేటు ఉంటుందా? అని ప్రశ్నించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్ మండలంలోని రంగాపూర్ గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కొందరు నేతలు హద్దు మీరి అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నరు. ఇది ఏమాత్రం తగదు. ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం మనందరిపైనా ఉంది. బీఆర్ఎస్ అహంకారం బయటకు వస్తోంది.

 కాంగ్రెస్, బీఆర్ఎస్ డైవర్షన్​పాలిటిక్స్​చేస్తున్నాయి. రెండు పార్టీలు ఒకరికొకరు తిట్టుకుంటూ వ్యూహాత్మకంగా ప్రజల దృష్టిని మళ్లించడమే ధ్యేయంగా పెట్టుకున్నాయి. మీరు ఒకరికొకరు తిట్టుకోవాలని, కొట్టుకోవాలని అనుకుంటే.. మేమే పరేడ్ గ్రౌండ్ వేదికగా ఏర్పాట్లు చేస్తం. ఎవరేందో తేల్చుకోండి. కానీ అసెంబ్లీని మాత్రం తిట్టుకోవడానికి ఉపయోగించొద్దని కోరుతున్న. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఈనెల 10 నుంచి మేడిపల్లి నుంచి ప్రజాహిత యాత్ర చేస్తున్నాం. నాకు ఈటలతో సహా ఎవరితోనూ విబేధాల్లేవు. పార్టీ ఆదేశాల మేరకు పనిచేయడమే తప్ప మరో ఆలోచనకు తావివ్వను. లోక్​సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే కాంగ్రెస్​ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయాలి. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే పథకాలు ఇస్తామని ఎన్నికల్లో ఎందుకు చెప్పలేదు’ అని బండి ప్రశ్నించారు.