ఫిర్యాదు చేసింది వాళ్లే.. బాధితులు వాళ్లే.. నేరస్తులు వాళ్లే : బండి సంజయ్

  • ఢిల్లీలో ఉన్నప్పుడే డీల్​ స్కెచ్​ వేసిండు: బండి సంజయ్​
  • కేసీఆర్.. నీకు రాజకీయ సమాధి తప్పదు
  • యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి వద్ద ప్రమాణం చేద్దాం రా?
  • ఫామ్​హౌస్​, హోటల్,  ప్రగతి భవన్ ఫుటేజీ బయటపెట్టాలి
  • సిట్టింగ్​ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్​

మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు: నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు పేరిట బుధవారం రాత్రి జరిగిన హైడ్రామా వెనుక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా సీఎం కేసీఆర్ దేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదని తెలియడంతో కేసీఆర్ బీజేపీని బద్నాం చేసేందుకు రెండు టీవీ చానళ్లతో కలిసి ఇలాంటి నీచమైన డ్రామాకు తెరదీశారని అన్నారు. ‘‘కేసీఆర్ కు దమ్ముంటే... ఈ వ్యవహారానికి సంబంధించి ఫామ్​హౌస్​లో, హోటల్ లో, ప్రగతి భవన్ లో గత వారం రోజులుగా జరిగిన సీసీ పుటేజీలన్నీ బయటపెట్టాలి” అని ఆయన డిమాండ్​ చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఈ వ్యవహారంలో బీజేపీకి సంబంధమే లేదని, ఇదే విషయంపై తనతోపాటు బీజేపీ నేతలంతా యాదగిరిగుట్టకు వచ్చి ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, కేసీఆర్ కు ఈ డ్రామాలో పాత్ర లేదని భావిస్తే... భార్యాపిల్లలతో వచ్చి ప్రమాణం చేయాలని సంజయ్​ సవాల్ విసిరారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఈ డ్రామాకు తెరదీసిన టీఆర్ఎస్ ను రాజకీయ సమాధి చేయడంతోపాటు దీని వెనుకనున్న పోలీసుల అంతు చూస్తామని హెచ్చరించారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని తిరగండల్లపల్లిలో బుధవారం రాత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘డీల్​ డ్రామాను చూస్తే నవ్వొస్తున్నది. ఫిర్యాదు చేసింది వాళ్లే.. బాధితులు వాళ్లే.. నేరస్తులు వాళ్లే.. దీనికి రెండు, మూడు ఛానళ్లు అత్యుత్సాహం చూపాయి. వాటిని చూసి జనం నవ్వుతున్నరు. రెండు ఛానళ్లకు సంబంధించిన రిపోర్టర్లు ముందే అక్కడే ఉన్నరు. పోలీసులైతే ఏకంగా కొన్ని  సీన్స్ షూట్ చేసి పెట్టుకున్నరు” అని అన్నారు. ‘‘రాజకీయాల కోసం స్వామిజీలను కేసులో ఇరికిస్తారా? హిందూ ధర్మమంటే అంత చులకనా?’’ అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి చేసిన కుట్ర ఇదని, అక్కడ స్వామిజీలను పిలిపించుకుని ఈ స్టోరీ ప్లాన్ చేశారని ఆయన ఆరోపించారు. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్.... నువ్వు యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయానికి రా.. టైమ్.. డేట్ ఫిక్స్ చెయ్.. మేమంతా అక్కడికి వస్తాం. ఇదంతా నిజంగా జరిగిందేనని, ఇందులో నీ స్కెచ్ లేదని ప్రమాణం చేస్తవా... కేసీఆర్?’’ అని అన్నారు. దక్కన్ కిచెన్ హోటల్ లో గత 3, 4 రోజుల సీసీ పుటేజీని పూర్తిగా విడుదల చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులు 3 రోజుల నుంచి అక్కడే అడ్డా పెట్టారని, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే రోజూ ప్రగతి భవన్ కు ఉదయం వెళ్లి రాత్రి వరకు ఉంటున్నారని, ఇది వాస్తవం కాదా అని నిలదీశారు. ప్రగతి భవన్ సీసీ పుటేజీలన్నీ విడుదల చేస్తే వాస్తవాలన్నీ బయటకు వస్తాయన్నారు. ‘‘ఈ డ్రామా వెనుక పోలీసాఫీసర్ పాత్ర ఉంది. గతంలోనూ ఓ మంత్రి తనపై హత్యాయత్నం చేసినట్లు డ్రామా చేయించడంలో ఈ పోలీసాఫీసరే అత్యుత్సాహం చూపిండు” అని ఆయన ఆరోపించారు. 

ఆ నలుగుర్ని అర్ధ రూపాయికి కూడా కొనరు

ఆ నలుగురు ఎమ్మెల్యేల నెత్తిపై రూపాయి పెడితే అర్ధ రూపాయికి కూడా ఎవరూ కొనేందుకు సిద్ధంగా లేరని, వాళ్లను కొనాల్సిన ఖర్మ కూడా బీజేపీకి లేదని సంజయ్​ అన్నారు. మునుగోడులో ఏ సర్వే చూసినా బీజేపీ గెలుస్తుందని తేల్చేశాయని, కొడుకు, అల్లుడుసహా అంతా ఇక్కడే తిష్టవేసినా లాభం లేకపోవడంతో కేసీఆర్ ఈ కొత్త డ్రామాకు తెరదీశారని ఆయన ఆరోపించారు. ‘‘వాళ్ల ఫాంహౌస్​కు వాళ్లే వెళ్లడం, వాళ్లే పోలీసులకు ఫోన్ చేయడం, 3 గంటలు అక్కడే ఎదురు చూడటం, తమను కాపాడాలని పోలీసులకు ఫోన్ చేయడం, ఇదంతా చూస్తుంటే నవ్వొస్తున్నది. అసలీ వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో, స్వామిజీలు గత వారం రోజులుగా ఎవరెవరినీ కలిశారో బయటపెట్టాలి. సనాతన హిందూ ధర్మం మీద తప్పుడు ప్రచారం చేయడానికి ఆడిన డ్రామా ఇది. హిందూ సమాజం కేసీఆర్​ను క్షమించదు. ఆయనకు రాజకీయ సమాధి తప్పదు” అని సంజయ్​ హెచ్చరించారు.

మునుగోడుపై చర్చకు సిద్ధమా?

రాష్ట్రం వచ్చిన నాటి నుంచి సీఎంగా మీరే ఉన్నారని, ఇప్పటి మీ పార్టీ మునుగోడు అభ్యర్థి ప్రభాకర్ రెడ్డియే 2014 నుంచి 2018 వరకు ఎమ్మెల్యేగా పని చేశారని, మరి ఈ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​ సీఎం కేసీఆర్‌‌ను  ప్రశ్నించారు. ఈ మేరకు 15 అంశాలపై ప్రశ్నలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బుధవారం హైదరాబాద్ లో మీడియాకు బహిరంగ లేఖను విడుదల చేశారు. చర్చకు మా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిద్ధమని, తారీఖు, టైమ్, వేదిక మీరే ఖరారు చేయాలని అందులో కోరారు. మీరిచ్చిన అన్ని హామీలను నెరవేర్చినట్లయితే 100 మంది కౌరవులను ( మీ పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను ), వారితో పాటు ఎర్రగులాబీలను (మీ దృష్టిలో సూది, దబ్బనం పార్టీలు) ప్రచారానికి ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించారు. ఇక్కడి బీసీల్లో  ఎంత మందికి సబ్సిడీ కింద రుణాలు ఇచ్చారని, ఇక్కడి నిరుద్యోగుల్లో ఎంత మందికి సర్కారు కొలువులు వచ్చాయో లెక్కలు ప్రకటించే దమ్ము మీకు ఉందా అని నిలదీశారు. 

కేసీఆర్​వి తుగ్లక్ చర్యలు: విజయశాంతి

హైదరాబాద్, వెలుగు : సీఎం కేసీఆర్  కామెడీ లిమిట్స్ దాటిపోయిందని, ఆయనవన్నీ తుగ్లక్ చర్యలని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి అన్నారు.  మునుగోడు పై సీఎం కేసీఆర్ కు తీవ్రమైన భయం పట్టుకుందని, అందుకే పాగల్ పనులు చేస్తున్నారని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎన్ని కట్టుకథలు అల్లినా ప్రజలకు నిజాలు తెలుసని ఆమె అన్నారు.

సీక్రెట్‌‌ డీల్‌‌ అయితే సీపీలో కాన్ఫిడెన్స్‌‌ ఏది?: డీకే అరుణ

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్​ఎస్​కు ఓటమి తప్పదనే భయంతో కేసీఆర్‌‌ మరో సినిమా స్టోరీ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ‘‘నిజంగానే పోలీసులు సీక్రెట్‌‌ డీల్‌‌ను బయట పెడితే సీపీ స్టీఫెన్‌‌ రవీంద్ర ముఖంలో ఆ ఉత్సాహం ఎక్కడ ఉంది.. కేసీఆర్‌‌ రాసిచ్చిన స్క్రిప్ట్‌‌ చదవాల్సిన దుస్థితి పోలీసులకు వచ్చింది. చిల్లర రాజకీయాలు చేయడంలో కేసీఆర్‌‌ దిట్ట.. ఫామ్‌‌హౌస్​లో జరిగిందంతా పెద్ద చిల్లర డ్రామా.. ఇది డ్రామా కాదంటే యాదాద్రిలో కేసీఆర్‌‌ ప్రమాణం చేస్తారా?’’ అని ఆమె ప్రశ్నించారు.  ఆ నలుగురిలో ఒక్కరు కూడా మళ్లీ ఎమ్మెల్యేలుగా గెలువరని, వాళ్లను కొనాల్సిన అవసరం లేదనన్నారు. ఆ ముగ్గురితో బీజేపీకి ఏలాంటి సంబంధం లేదని చెప్పారు.