రాజకీయాల కోసం కూతురు పేరును వాడుకోవడం సీఎం కేసీఆర్కే చెల్లిందని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్ అన్నారు. కవితను ఆహ్వానించడం కాదు..మొత్తం టీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తామన్నా కూడా ఒప్పుకోమన్నారు. ఫామ్‌హౌస్ ఘటనపై సీబీఐ లేదా హైకోర్టు జడ్జితోనే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నలుగురు ఎమ్మెల్యేలను ఎందుకు ప్రగతిభవన్లో నిర్బంధించారో సీఎం కేసీఆర్ చెప్పాలన్నారు. సిట్ విషయంలో బీజేపీ ఆరోపణలే నిజమయ్యాయన్నారు. అందుకే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో కేసు విచారణ జరగడం హర్షణీయమన్నారు.
కవితను కావాలనే ఓడించారు..
2019 ఎంపీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఓటమి వెనుక టీఆర్ఎస్ అధిష్టానం ఉందనే ఆరోపణలు ఉన్నాయని బూర నర్సయ్యగౌడ్ ఆరోపించారు. కవిత టీఆర్ఎస్లో మరో పవర్ సెంటర్ కావొద్దన్న కారణంతో ఆమెను ఓడించారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ సొంత ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారన్నారు. 90 శాతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో గెలవరని జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో బీసీలు అణిచివేతను గురయ్యారని చెప్పారు. బీసీలను ఆర్థికంగా అణిచివేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. గత 8 ఏళ్లలో బీసీ ఫెడరేషన్స్‌కు ప్రభుత్వం కేవలం రూ. 230 కోట్లే కేటాయించిందన్నారు. బీసీ ఫెడరేషన్స్‌కు చట్టబద్ధత కల్పించాలని..లేదంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.