ఈ డబ్బులు తీసుకుని బీజేపీకి ఓటు వేయండి : వీడియోకు దొరికిన కమలం నేత

ఈ డబ్బులు తీసుకుని బీజేపీకి ఓటు వేయండి : వీడియోకు దొరికిన కమలం నేత

దేశ వ్యాప్తంగా మొదటిదశ  లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో ఓటింగ్ జరుగుతున్న టైమ్ లో  బీజేపీ నగర అధ్యక్షుడు అంకుర్ శుక్లా ఓటర్లకు డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.  

ఇది బీజేపీ నీచమైన చర్య , అవినీతికి పర్యాయపదం బీజేపీ అంటూ మండిపడింది.  అంతేకాకుండా చింద్వారా ఎన్నికల్లో బీజేపీ భారీ తేడాతో ఓడిపోతోందంటూ ట్వీట్ లో తెలిపింది.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా భారీ స్థాయిలో స్పందన వస్తోంది. 

చింద్వారా లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోటేనని చెప్పాలి.  ఇక్కడి నుండి మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్‌ కుమారుడు  నకుల్ నాథ్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి  వివేక్ బంటీ సాహు పోటీలో ఉన్నారు.  కమల్ నాథ్ 1980 నుండి తొమ్మిది సార్లు చింద్వారా నుంచి  లోక్ సభకు ఎన్నికయ్యారు.  1997లో ఒక్కసారి మాత్రమే ఇక్కడి నుంచి బీజేపీ గెలిచింది.  . లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 29 స్థానాలపై బీజేపీ కన్నేసింది.  ముఖ్యంగా చింద్వారాపై గట్టి ఫోకస్ పెట్టింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంటి ప్రముఖ వ్యక్తులు ఇక్కడ రోడ్ షో నిర్వహించారు.