లెప్రసీ కాలనీలో ఆక్రమణలు ఆపాలని బీజేపీ లీడర్ డిమాండ్‌

యాదాద్రి(బీబీనగర్​), వెలుగు: బీబీనగర్‌‌లోని లెప్రసీ కాలనీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను ఆపాలని బీజేపీ లీడర్ ​పిట్టల అశోక్​ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దార్‌‌ ఆఫీసులో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుష్టు వ్యాధి పీడితుల కోసం గత ప్రభుత్వం బీబీనగర్​లోని సర్వే నెంబర్ 495లో రెండు ఎకరాల స్థలం కేటాయించి లెప్రసీ కాలనీ ఏర్పాటు చేసిందన్నారు. 

ప్రస్తుతం అక్కడ ముగ్గురు మాత్రమే ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్నారని, దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు కాలనీ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. గత మూడు నెలల్లోనే ఎలాంటి అనుమతులు లేకుండా ఒక చర్చితో పాటు 20 ఇండ్లను  నిర్మించారని మండిపడ్డారు. ఈ నిర్మాణాలను  నిలిపివేసి కుష్టు వ్యాధి పీడితుల కోసం కేటాయించిన స్థలాన్ని సంరక్షించాలని  కోరారు.