సూసైడ్‌‌‌‌ లెటర్‌‌‌‌ రాసి బీజేపీ లీడర్‌‌‌‌ అదృశ్యం

సూసైడ్‌‌‌‌ లెటర్‌‌‌‌ రాసి బీజేపీ లీడర్‌‌‌‌ అదృశ్యం

ధర్మసాగర్, వెలుగు: తనపై అక్రమ కేసులు పెట్టారంటూ సూసైడ్‌‌‌‌ లెటర్‌‌‌‌ రాసి బీజేపీ మండల నాయకుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌‌‌‌లో గురువారం వెలుగుచూసింది. ధర్మసాగర్‌‌‌‌కు చెందిన గంకిడి దామోదర్‌‌‌‌రెడ్డి, బొల్లం వీరస్వామి అనే వ్యక్తుల మధ్య కొంత కాలంగా భూ తగాదా నడుస్తోంది. ఇదే విషయంలో రెండు రోజుల కింద ఇద్దరి మధ్య గొడవ జరగగా మడికొండ పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లో ఇరువర్గాలపై కేసులు నమోదు అయ్యాయి. 

అయితే తనపై అక్రమ కేసు పెట్టారంటూ గంకిడి దామోదర్‌‌‌‌రెడ్డి కుమారుడు శ్రీనివాస్‌‌‌‌రెడ్డి సూసైడ్‌‌‌‌ లెటర్‌‌‌‌ రాసి బుధవారం రాత్రి అదృశ్యం అయ్యాడు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు లేచి చూడగా శ్రీనివాస్‌‌‌‌రెడ్డి కనిపించకపోవడం, సూసైడ్‌‌‌‌ లెటర్‌‌‌‌ దొరకడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ధర్మసాగర్ ఇన్స్‌‌‌‌పెక్టర్‌‌‌‌ మహేందర్ తెలిపారు. ‘నా చావుకు కాజీపేట ఏసీపీ, మడికొండ సీఐతో పాటు ధర్మసాగర్‌‌‌‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు కారణం’ అని శ్రీనివాస్‌‌‌‌ రాసిన సూసైడ్‌‌‌‌ నోట్‌‌‌‌ వైరల్‌‌‌‌గా మారింది. 

ప్రశ్నించినందుకే కేసులో ఇరికించాడు

శ్రీనివాస్‌‌‌‌రెడ్డి లెటర్‌‌‌‌పై గ్రామానికి చెందిన రావుల వెంకట్‌‌‌‌రెడ్డి, మాజీ సర్పంచ్‌‌‌‌ ఎర్రబెల్లి శరత్‌‌‌‌ తదితరులు మీడియాతో మాట్లాడారు. గంకిడి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి గ్రామంలోని కొందరి భూములు ఆక్రమించాడని, అతడిపై పలు పోలీస్‌‌‌‌ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయని, జైలుకు సైతం వెళ్లి వచ్చాడని చెప్పారు. తన అక్రమాలను ప్రశ్నించినందున ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని రెండు రోజుల క్రితం జరిగిన భూతగాదాలో తాను సంఘటనాస్థలం లేకున్నా అక్రమంగా కేసులో ఇరికించాడని వెంకట్‌‌‌‌రెడ్డి ఆరోపించారు.