భారీ వర్షాలకు పంటన ష్టపోయిన రైతులను ఆదుకోవాలె : డీకే అరుణ

తెలంగాణలో భారీ వర్షాలకు వందల ఎకరాల్లో పంటలు నష్టపోయాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ పేరుతో కమీషన్లు తీసుకోవడం కారణంగానే ఇంత స్థాయిలో పంట నష్టం వాటిల్లిందని ఆరోపించారు. బాల్కొండ నియోజకవర్గంలో చెక్ డ్యామ్ కట్టడం వల్లే తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలంలో వర్షాల వల్ల నష్టపోయిన పంట పొలాలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పరిశీలించారు. జిల్లా నాయకులు, నియోజకవర్గ నేత మల్లికార్జున్ రెడ్డితో కలిసి పంటల పొలాలను పరిశీలించారు.  

సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలోనూ రైతులు పంట నష్టపోయినా కనీసం వారిని పట్టించుకున్న నాథుడే లేడన్నారు డీకే అరుణ. రైతులకు ఎన్ని లక్షలు ఇచ్చినా పంట నష్టాన్ని భర్తీ చేయలేమని చెప్పారు. రాష్ట్ర రైతులను పట్టించుకోని ముఖ్యమంత్రి దేశంలోని రైతుల కండ్లు తుడుస్తారా..? అని రైతులు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నాసిరకంగా నిర్మించిన చెక్ డ్యామ్ ల పై వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. రైతులకు నష్టపరిహారంతో పాటు పంటలకు ఉపయోగపడేలా భూములను చదును చేసి ఇవ్వాలన్నారు. చెక్ డ్యామ్ లు నిర్మించి.. నీళ్లు తీసుకొచ్చామని ఫొటోలకు ఫోజులు ఇవ్వాలని చూశారే తప్ప నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించలేదని ఆరోపించారు.