ప్రజలు అసహ్యించుకునేలా చేసుకోవద్దు
ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అడ్డదారులు: డీకే అరుణ
హైదరాబాద్, వెలుగు: దుబ్బాక బీజేపీ అభ్యర్థిపై జరుగుతున్న దాడుల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. వెంటనే కేంద్ర బలగాలను భద్రత కోసం పంపాలన్నారు. సోమవారం హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దుబ్బాకలో టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉందని, అందుకే ఎలాగైనా గెలవాలని ఆ పార్టీ చూస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ ఇంటితో పాటు బంధువులు ఇండ్ల పై పోలీసులు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ‘‘పోలీసులు గులాబీ చొక్కాలు తొడుక్కున్నరా.. టీఆర్ఎస్ కండువాలు వేసుకున్నరా? పోలీసుల వెహికల్స్ లో డబ్బులు పంపుతున్నరు. కాలం ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండదనే విషయం గుర్తించుకోవాలి” అని ఆమె హెచ్చరించారు. పోలీసులంటే ప్రజలు అస్యహించుకునేలా చేసుకోవద్దన్నారు. బీజేపీ గెలుస్తుందని సర్వేల్లో తెలుసుకున్న టీఆర్ ఎస్.. అడ్డదారులు తొక్కుతున్నదని, మంత్రి హరీశ్ వ్యవహార శైలి సరిగా లేదని, ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారన్నారని మండిపడ్డారు. ఎన్నికలు సరిగా జరిగేలా కనిపించడం లేదన్నారు. కేసీఆర్ ఆహంకారం తగ్గాలంటే దుబ్బాక లో బీజేపీని గెలిపించాలని, టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలని, ఒక చారిత్రక తీర్పు దుబ్బాక ఓటర్లు ఇవ్వాలని డీకే అరుణ కోరారు.
సంజయ్ అరెస్టుపై ఫైర్
సిద్దిపేటలో ఎంపీ బండి సంజయ్ అరెస్టుపై డీకే అరుణ మండిపడ్డారు. పోలీసులు అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ అనే గౌరవం లేకుండా బండి సంజయ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సిగ్గుచేటన్నారు. పోలీస్ అంటేనే ప్రజలు చులకనగా చూసే పరిస్థితి దాపురించిందన్నారు.
For More News..