- బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే.అరుణ
గద్వాల, వెలుగు : తెలంగాణపై సీఎం కేసీఆర్ పట్టు కోల్పోయారని, అందుకే దేశ్ కీ నేత అంటూ ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నారని బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే.అరుణ ఎద్దేవా చేశారు. మునుగోడు ఉప ఎన్నికల కోసమే కొత్త పెన్షన్లు శాంక్షన్ చేశారన్నారు. హైదరాబాద్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మహిళల మృతికి బాధ్యత వహిస్తూ హెల్త్ మినిస్టర్ హరీశ్‌రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గురువారం గద్వాలలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్‌ను నమ్మే పరిస్థితులు లేకపోవడం వల్లే బీజేపీపై మతతత్వ ఆరోపణలు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే పెన్షన్ హామీ ఇచ్చినప్పటి నుంచి రూ. 2000 వేల చొప్పున అందజేయాలని డిమాండ్ చేశారు.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు చనిపోతే కేటీఆర్ స్పందించకపోవడం దారుణం అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో కొత్తగా మంజూరైన పెన్షన్లలో 40 శాతం వరకు అనర్హులే ఉన్నారని, అన్ని అర్హతలు ఉన్నా చాలా మందికి పెన్షన్ రాలేదన్నారు. టీఆర్‌ఎస్ లీడర్లు పైరవీలు చేసిన వారికి, టీఆర్ఎస్ లీడర్ల బంధువులకు పెన్షన్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అర్హులకు పెన్షన్లు రాకపోతే బీజేపీ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో లీడర్లు గడ్డం కృష్ణారెడ్డి, బండల వెంకట్‌రాములు, వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేశ్ పాల్గొన్నారు.