ముస్లిం రిజర్వేషన్లతో బీసీలకు నష్టం : లక్ష్మణ్

ముస్లిం రిజర్వేషన్లతో బీసీలకు నష్టం : లక్ష్మణ్
  • ఫేక్ వీడియోలతో బీజేపీపై తప్పుడు ప్రచారం

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, బీసీ, ఎస్టీలకు దక్కాల్సిన వాటాను ముస్లింలకు కల్పించడం మతపరమైన రిజర్వేషన్లు కాదా అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ప్రశ్నించారు. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ చేస్తున్న అవాస్తవ ప్రచారంలో ఆర్ఎస్ఎస్ ను లాగడం సరికాదన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ స్వయంగా తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు. 

బుధవారం బీజేపీ స్టేట్​ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రధాన ప్రత్యర్థిగా తెలంగాణలో బీజేపీ ఎదిగింది కనుకే.. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ చేసిన అవినీతిని కక్కిస్తామని ప్రతిపక్ష హోదాలో రేవంత్ రెడ్డి చెప్పాడనీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మెతకవైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సీఎం స్థాయికి తగ్గట్లు వ్యవహరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతో ఫేక్ వీడియోలు తయారు చేసి బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి మీద మార్ఫింగ్ వీడియోల వెనక ఎవరున్నారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

బీసీ రిజర్వేషన్లు 34 % నుంచి 18% కి తగ్గించింది

2004, 2009లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. బీసీ-ఈ గ్రూపును క్రియేట్ చేసి 14 ముస్లిం సామాజికవర్గాలను చేర్చి వారికి 4శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. దీంతో స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం దానిని 18శాతానికి తగ్గిస్తే నోరువిప్పని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రిజర్వేషన్ల గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. జీఎచ్ఎంసీలోని 150 డివిజన్లలో బీసీలకు 50 డివిజన్లలో సీట్లు కేటాయిస్తే, 31సీట్లలో ముస్లిం అభ్యర్థులు బీసీల పేరు మీద గెలిచారని చెప్పారు. 

ఇది బీసీల హక్కులను కాలరాయడం కాదా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి అమిత్ షా 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంచుతామన్నారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టి మోదీ మాదిగలకు న్యాయం చేయాలని భావిస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క మాదిగ కులానికి ఒక్క సీటివ్వలేదని విమర్శించారు.