కరీంనగర్: ‘నాకు ఓటేస్తే దళితబంధు ఇవ్వనంటున్నారట. దళితబంధు నీ అబ్బ జాగీరా.. మిస్టర్ ముఖ్యమంత్రి’ అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. అంతకు ముందు మన ముఖం చూడని ఎమ్మెల్యేలు, మంత్రులు గ్రామాల్లో అడ్డాలు పెట్టి మరీ దావత్‌లు ఇస్తున్నారని ఆయన అన్నారు. వీణవంక మండలం మల్లన్నపల్లిలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పర్యటిస్తున్నారు. కోలాటాలు, డప్పు చప్పుళ్ల మధ్య ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈటల సమక్షంలో పలువురు నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
‘నేను రాజీనామా చేయకపోతే.. ఇంతమందికి హుజురాబాద్‌లో పదవులు వచ్చేవా? మీకు ప్రగతిభవన్‌లో ప్రవేశం దొరికిందంటే అది నావల్ల కాదా? అంతకు ముందు మన ముఖం చూడని ఎమ్మెల్యేలు, మంత్రులు గ్రామాల్లో అడ్డాలు పెట్టి దావత్‌లు ఇస్తున్నారు. గొర్రెల మంద మీద పిచ్చికుక్కలు దాడి చేసినట్లు.. నా మీద దాడి చేస్తున్నారు. ఈ ఒక్క గ్రామానికే నేను పదులసార్లు వచ్చాను. ప్రతి కాలువ గట్టుమీద, ప్రతి వాడల్లో నా పాద ముద్రలున్నాయి. వీణవంక వాగుపై నేను కట్టించిన చెక్ డ్యాంల వల్ల జలహారంగా మారింది. నా మీద మాట్లాడే మంత్రులు.. గ్రామాలలో నేను చేసిన అభివృద్ధి చూడాలి. ఇక్కడకు వచ్చే లీడర్లు చిల్లరగా మాట్లాడుతున్నారు. నామీద చిల్లర ఆరోపణలు చేస్తే సూర్యుడి మీద ఉమ్మెసినట్లే అవుతుంది.
నాకు ఓటేస్తే దళితబంధు ఇవ్వనంటున్నారట
దళితబంధు నీ అబ్బ జాగీరా.. మిస్టర్ ముఖ్యమంత్రి. నాకు ఓటేస్తే దళితబంధు ఇవ్వనంటున్నారట. మా వాళ్లను మీరు పెట్టే హింసను చూసి ఇలా మాట్లాడాల్సి వస్తోంది. వాళ్ల బాధలు చెబుతుంటే.. నా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. మనం కొనే వస్తువులకు కట్టే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం మళ్లీ మనకు ఇస్తున్నారు తప్ప.. వాళ్ల జేబుల నుంచి మనకేమీ ఇవ్వడం లేదు. కేవలం మద్యం మీదనే ప్రభుత్వానికి 30 వేల కోట్ల ఆదాయం వస్తోంది. మన పైసలకు కాపాలాదారుగా ఉండాల్సినోడు.. మనమీద అధికారం చెలాయిస్తే ఊరుకుంటామా? ప్రజల సొమ్ముకు వాళ్లు కేర్ టేకర్లు మాత్రమే. నా వెంట ఒక్కరిని కూడా ఉండనీయడట. అది మీకు సాధ్యమవుతుందా? ఒక్కరు పోతే.. నాకు వంద మంది అండగా ఉంటారు. నాయకులు పోతే పోనీ.. మేమున్నామని ప్రజలు నాకు భరోసా ఇస్తున్నారు. నాతో పాటు మూడ్నెళ్లపాటు తిరిగినోళ్లు కూడా పోయారు. గత 20 ఏళ్ల కింద ఎలా ఉన్నానో.. ఇవాళ కూడా అలాగే ఉన్నా. మీ దగ్గర నేను ఏనాడు దావతుల్లో కూర్చోవడానికి రాలేదు. మీకు ఆపద వస్తే ఆదుకునేందుకు మాత్రమే వచ్చాను. ఇప్పుడు ప్రతి పల్లె.. దావత్‌లకు అడ్డాగా మారింది. చిన్న పిల్లలను కూడా తాగుడుకు అలవాటు చేస్తున్నారు. ప్రజల మద్య చిచ్చుపెడుతున్నారు. బాధ్యత గల మంత్రుల్లారా.. మీరు చేయాల్సింది ఇలాంటి పనులేనా? రోజు ఇక్కడికి వచ్చి, చిటికెలు వేసి నాయకులను కొనుగోలు చేస్తున్న హరీశ్ రావును అడగండి. ఆయన దగ్గర దళితబంధు ఇస్తున్నారా? హరీశ్ రావు నాయకులను పిలిపించుకుని.. బీజేపీలో నాయకులు ఇంకా ఎందుకు మిగిలారని బెదిరిస్తున్నాడట. అర్ధరాత్రి కార్లు వేసుకుని ఇండ్లలోకి వచ్చి.. మా దగ్గరకు రా అని వేధిస్తున్నారట. మీరు పిడికెడు మందిని వశం చేసుకోవచ్చు.. కానీ ప్రజలను మాత్రం వశం చేసుకోలేరు.
నా మీద మీ కుల ప్రయోగం నడవదు
అన్ని గ్రామాల ప్రజలు.. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా నీవెంటే ఉంటామని నాకు హామీ ఇస్తున్నారు. నా మీద మీ కుల ప్రయోగం నడవదు. నా ఇంటికి ఎవరు వచ్చినా.. మీ బాదేంది అని అడిగాను తప్ప.. కులం గురించి అడిగానా? ఇక్కడ కొట్లాట నాకు, కేసీఆర్‌కు మాత్రమే. ఇక్కడకొచ్చే నాయకులతో కాదు. మీరు ఎన్ని స్కీంలు పెట్టినా, ఎంత ఖర్చు చేసినా, చివరికి మీరు మోకాళ్ల మీద నడిచినా మీకు ఓట్లు పడవు. నా మీద జరుగుతున్న దాడిని ఆపగలిగే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుంది. ఓ పోరగాన్ని నామీద పెట్టి నన్ను ఖతం పట్టిస్తారట.. మీతో సాధ్యమవుతుందా? నేను చనిపోయిననాడు నా ప్రజలు కంటనీరు పెట్టేలా బతకాలనుకుంటున్నా. దళితబంధు ఇస్తున్నాం, పింఛన్ ఇస్తున్నాం కాబట్టి ఇంటి మీద జెండా పెట్టుకోవాలని వేధిస్తున్నారట. అవి మీ డబ్బులు కాదు.. మీ ఇంట్లో నుంచి ఇవ్వడం లేదు. మీరు పథకాల ద్వారా డబ్బులిచ్చి నన్ను పొడవమని కత్తి ఇస్తే ప్రజలు పొడుస్తారా? ఈ స్కీంలన్నింటి వెనక నన్ను ఓడించాలనే కుట్ర తప్ప ఇంకేమీ లేదు’ అని ఈటల రాజేందర్ అన్నారు.
For More News..