పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీస్కోవాలి: బీజేపీ నేత ఏలేటి

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీస్కోవాలి: బీజేపీ నేత ఏలేటి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీజేపీఎల్​పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని అన్నారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడారు. 

హైకోర్టు తీర్పును మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతించడం మంచి పరిణామమని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ సర్కారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు.. దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడిందని గుర్తుచేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే, వారి ఇండ్లముందు చావు డప్పు కొట్టాలని పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారని, ప్రస్తుతం ఆయనే ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్​పార్టీలో అనైతికంగా చేర్చుకుంటున్నారని, ఇది ఎంతవరకు కరెక్టో చెప్పాలని ఏలేటి ప్రశ్నించారు.

 ప్రజలకిచ్చిన హామీలను వదిలేసి, వరద బాధితులకు సాయం వదిలేసి, కలెక్షన్ల బిజీలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని విమర్శించారు. కుటుంబ ఫ్రెషర్స్ , ఒవైసీకి భయపడే హైడ్రా పై సీఎం వెనక్కి తగ్గారని విమర్శించారు. హైడ్రా వెనక వందల కోట్లు చేతులు మారుతున్నాయని ఆరోపించారు.