
- డేట్ ఫిక్స్ చేసి చెప్పాలి:ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- అవినీతి సొమ్మును ఎప్పుడు కక్కిస్తారో చెప్పాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో ఆరోపణలు చేశారని, వాటిపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారో చెప్పాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. దీనికిగానూ డేట్ ఫిక్స్ చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలోని బీజేఎల్పీ ఆఫీస్‌లో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘‘కేటీఆర్ దుబాయ్ లో ఏం చేశాడో రికార్డులు ఉన్నాయని రేవంత్ రెడ్డి అన్నారు.
వాటిని బయటపెట్టి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? కాళేశ్వరం అవినీతి, ధరణి, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా రేస్ అంశాలపై చర్యలేవి? కేసీఆర్ తిన్న అవినీతి సొమ్మును వెనక్కి తెస్తామని గతంలో మాట్లాడారు. ఇప్పుడు దానికోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ కుటుంబసభ్యులను అరెస్ట్ చేస్తా.. జైల్లో వేస్తా అని అన్నరు. ఇప్పుడేం అయింది? మంత్రి పొంగులేటి ఏమో.. బాంబులు పేలుతాయని అన్నరు. చివరికి అవన్నీ తుస్సు బాంబులయ్యాయి’’అని మహేశ్వర్ రెడ్డి అన్నారు.
రేవంత్ రెడ్డిది.. హామీల ఎగవేతల సర్కార్
రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. హామీల ఎగవేతల, సమాధానాల దాటవేతల సర్కార్ అని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ‘‘పసలేని, మ్యాటర్ లేని రేవంత్ రెడ్డి ఏకపాత్రాభినయాన్ని అసెంబ్లీలో అందరూ చూశారు. మేనిఫెస్టోలో ఉన్న హామీలు అమలు చేయమంటే.. లేని ఫ్యూచర్ సిటీ.. కొడంగల్ డెవలప్మెంట్.. మూసీ ప్రక్షాళన.. హైడ్రా అంశాలు ఎందుకు ఎత్తుకున్నరు? కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్ట్‌లు చేస్తున్నరు. కాంగ్రెస్, బీఆర్ఎస్ డూప్ ఫైట్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ నేతను సభ నుంచి బహిష్కరించడంతో నిరసనలు తెలుపుతూ చర్చ సజావుగా జరగకుండా డైవర్ట్ చేస్తున్నారు.
సీఎం రేవంత్ కు బట్టలు ఊడదీసే ఫాంటసీ ఏంటో? అర్థం కావడం లేదు’’అని ఏలేటి అన్నారు. చట్టసభల్లో ఒక సీఎం ఇలాగే మాట్లాడుతారా? అని నిలదీశారు. కేసీఆర్‌లాగే.. రేవంత్ కూడా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను అవకాశాల కోసం పార్టీలు మారే వ్యక్తిని కానని, ముందు పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను సరిగ్గా కాపాడుకోవాలని సూచించారు.